-
-
Home » Andhra Pradesh » Nellore » Sullurupeta
-
‘లాక్’ వీడేదెప్పుడు!?
ABN , First Publish Date - 2020-06-23T10:33:52+05:30 IST
ఒకటి, రెండు వారాలు కాదు.. దాదాపు 3 మాసాలుగా సూళ్లూరుపేట లాక్‌డౌన్‌తో అతలాకుతలమవుతోంది.

మూణ్నెల్లుగా సూళ్లూరుపేట వాసుల అవస్థలు
దివాలా దిశగా వ్యాపారులు
ఇళ్లలోనే అల్లాడుతున్న కూలీలు
సూళ్లూరుపేట, జూన్ 22 : ఒకటి, రెండు వారాలు కాదు.. దాదాపు 3 మాసాలుగా సూళ్లూరుపేట లాక్‌డౌన్‌తో అతలాకుతలమవుతోంది. మార్చి 25 నుంచి మే 10వ తేదీ వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకున్నా పట్టణాన్ని రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించి కట్టడి చేసేశారు. మే 10వ తేదీ నుంచి చెన్నై కోయంబేడు లింకుల ద్వారా సూళ్లూరుపేటలో కరోనా పాకింది. దీంతో పట్టణంలో వీధి వీధినా బారికేడ్లతో దిగ్బంధించారు. కోయంబేడు లింకుల కారణంగా ఇక్కడ 100 మందికిపైగా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆ కేసులు ఆగినా, పరిశ్రమల్లో కార్మికుల ద్వారా మళ్లీ కరోనా సూళ్లూరుపేటలో వ్యాపించడం ప్రారంభించింది.
వారం రోజులుగా 14 మంది కార్మికులకు కరోనా సోకినట్లు తేలడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. పరిశ్రమల ద్వారా కరోనా విస్తరిస్తుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. పరిశ్రమల్లో విరివిగా కరోనా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆయా పరిశ్రమల్లోనే సిబ్బంది కొంతకాలం ఉండేలా ఏర్పాట్లను యాజమాన్యాల ద్వారా నిర్వహింపచేయాలి. అలా కాకుండా పరిశ్రమల యాజమాన్యాల ఒత్తిడితో సూళ్లూరుపేట నుంచి వెళ్లే సిబ్బందిని పట్టించుకోకపోతే కరోనా ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ కొనసాగితే...
సూళ్లూరుపేటలో మూడు మాసాల నిరవధిక లాక్‌డౌన్‌తో పలువురు వ్యాపారులు దివాలతీసి ఊరు వదిలివెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే దుకాణాలలో పనిచేసే వేలాదిమంది పనులు లేకపోవడంతో వారి కుటుంబాలు పూటగడవక దుర్భరంగా బతికే పరిస్థితులు కలుగుతున్నాయి. వీటితోపాటు గృహ నిర్మాణాలన్నీ ఆగిపోవడంతో బేల్దారులు, కూలీలు పనులు లేక అవస్థలు పడుతున్నారు.
ఫ 4 గంటలు సడలించినా..
గత వారం రోజులుగా సూళ్లూరుపేటలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణాలు తెరుచుకునేలా లాక్‌డౌన్‌ను అధికారులు సడలించారు. అయితే బజారువీధుల్లోకి ద్విచక్రవాహనాలను అనుమతించకకపోవడంతో నడిచి వెళ్లి సరుకులు కొని మోసుకురావడం ఇబ్బంది అవుతుండటంతో ప్రజలు బజారుకు రావడం లేదు. గ్రామీణ ప్రజలు దూరభారమైనా శ్రీకాళహస్తికో, నాయుడుపేటకో, తడకో వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు. దీంతో దుకాణాలు తెరచినా వ్యాపారాలు జరగక వ్యాపారులు బిక్కముఖం వేస్తున్నారు.