కళతప్పిన కార్పొరేషన్లు
ABN , First Publish Date - 2020-12-21T04:58:37+05:30 IST
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే సబ్సిడీ రుణ పథ కాలు అటకెక్కాయి.

రెండేళ్లుగా జాడలేని సబ్సిడీ రుణాలు
అటకెక్కిన సంక్షేమ పథకాలు
ఇన్‌చార్జి ఈడీలే దిక్కు
నెల్లూరు(వీఆర్సీ), డిసెంబరు 20 : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే సబ్సిడీ రుణ పథ కాలు అటకెక్కాయి. రెండేళ్లుగా సబ్సిడీ రుణాలకు ప్రభుత్వం మంగ ళం పాడడంతో రుణాల కోసం కార్యాలయాలకు వచ్చే లబ్ధిదారులు కరువై కళ తప్పాయి. గతంలో ఆయా కార్పొరేషన్‌ల ద్వారా బ్యాంకు లింకేజీలతో, నేరుగా 50శాతం పైగా సబ్సిడీ రుణాలు అందించేవారు. ప్రస్తుతం ఆ రుణాలు అందని ద్రాక్షలా మారడంతో ఆర్థికంగా స్వయం ఉపాధిని పొందే నిరుద్యోగులు కరువయ్యారు. ఏడాది పొడవునా ఏదో ఒక పద్ధతిలో రుణాలు అందిస్తున్న కార్పొరేషన్లు ఒట్టిపోయిన పాడిలా తయారయ్యాయి. గతంలో ఈ కార్పొరేషన్‌ల ద్వారా ఇన్నోవా కార్లు, ఇతర రవాణా వాహనాలు, వ్యవసాయానికి ట్రాక్టర్లు అందించేవారు. ఎస్సీలకు ప్రత్యేకంగా భూమి అభివృద్ధి, భూమి కొనుగోలు, ఉచిత బోరు, విద్యుత్ మోటార్లను అందించేవారు. ఇందుకోసం లబ్ధిదారుని వాటాగా 10శాతం మాత్రమే కట్టించుకుని రూ. లక్ష విలువైన యూనిట్లను అందించేవారు. పరిమితి లేకుండా అర్హులు జిల్లా కలెక్టర్ ఆమోదంతో లబ్ధిపొందేవారు. అంతే కాకుండా ఎ స్సీ, బీసీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులతో పనిలేకుండా నేరు గా ఆయా కార్పొరేషన్‌ల ద్వారా స్వయం ఉపాధికి టెంట్‌హౌస్, సెం ట్రింగ్, జెరాక్స్, నెట్ సెంటర్లు వంటి యూనిట్లు మంజూరు చేసి నిరుద్యోగులకు ఆసరా కల్పించేవి.
ప్రకటనలకే పరిమితమైన మాల, మాదిగ కార్పొరేషన్‌లు
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే మాల, మాదిగ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ జీవోలు జారీ చేసింది. అవి ప్రకటనలకే పరిమితం కావడంతో ఆయా వర్గాల ప్రజలు నిరాశ చెందారు. రెండేళ్ల కాలంలో ఒక్క లబ్ధిదారుడికి కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు సరికదా ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించ లేదు. ఇంత వరకు ఆయా కులాల పేరుతో కార్పొరేషన్ల బో ర్డులు సైతం ఏర్పాటు కాకపోవడం విచి త్రం.
ఇన్‌చార్జి ఈడీలే దిక్కు.
ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌లకు రెండేళ్ల కాలంలో ఇన్‌చార్జి ఈడీలే దిక్కయ్యారు. రెగ్యులర్ ఈడీలు లేకపోవడం, వాటి స్థితిగతులు ప్రభుత్వానికి తెలియజెప్పేవారు కరువయ్యారు. దీంతో ఆయా కార్యాలయాల్లో ఒకరిద్ద రు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన వారంతా ఔట్‌సోర్సింగ్ వారే. బీసీ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్ తప్ప అందరూ తాత్కాలిక ఉద్యోగులే. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రామ సచివాలాయాలకే పరిమితం కావడంతో జిల్లా కేంద్రంలో ఈ కార్యాలయాలు నామమాత్రంగా మారిపోయాయి.