నిర్మాణాలపై సి‘మంట’
ABN , First Publish Date - 2020-05-29T10:48:51+05:30 IST
కరోనా కారణంగా ఆగిపోయిన తమ కలల సౌధాల నిర్మాణ పనులు లాక్డౌన్ సడలింపుల అనంతరం పునఃప్రారంభించేందుకు ..

పెరిగిన ధరతో బెంబేలు
ఇసుక పరిస్థితీ అంతే!
జేబు తుప్పు వదల్చుతున్న ఇనుము
గూడూరు, మే 28 : కరోనా కారణంగా ఆగిపోయిన తమ కలల సౌధాల నిర్మాణ పనులు లాక్డౌన్ సడలింపుల అనంతరం పునఃప్రారంభించేందుకు పేద, మధ్య తరగతి వర్గాలకు పెనుభారంగా మారింది. మరోవైపు ధరల పెరుగుదలతో వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. స్టీలు, సిమెంటు, ఇసుక తదితర ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో గృహ నిర్మాణానికి కేటాయించుకున్న బడ్జెట్ అంచనాలకు అందకుండా పెరిగిపోవడంతో పేద మధ్య తరగతి నిర్మాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిమెంట్ ధర మార్చి మొదట్లో రూ.280 ఉండగా ప్రస్తుతం రూ.380కు చేరుకుంది. సిమెంటు మంట ఇలా ఉండగా మార్చి మొదటి వారంలో టన్ను స్టీలు ధర రూ.48 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 49 వేలుకు చేరుకుంది. దీంతో నిర్మాణ పనులు నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక పరిస్థితి దయనీయం..
ఆన్లైన్లో ఇసుక దొరకడమే గగనం కావడంతో, బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టరు లోడు రూ. 3500 దొరుకుతున్న ఇసుకకు ప్రస్తుతం రూ. 5000 చెల్లించాల్సి వస్తోందంటున్నారు
తగ్గిన ఇటుక ధర
ఇటుకలు మాత్రం ధర తగ్గి వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి. మార్చిలో రెండు వేల ఇటుకలు రూ. 12 వేలకు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రూ. 9 వేలకే లభ్యమవుతున్నాయి.