పర్యావరణానికి...‘పచ్చతోరణం’
ABN , First Publish Date - 2020-06-25T10:36:28+05:30 IST
రాష్ట్రంలో వర్షాలు మొదలవడంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడానికి

త్వరలో ప్రారంభం
లక్ష్యం 39.06లక్షలు... నర్సరీల్లో 56 లక్షల మొక్కలు
ప్రతి గ్రామంలో 2 కి.మీ. అవెన్యూ ప్లాంటేషన్
ఈసారైనా సంరక్షిస్తారా?
నెల్లూరు (వెంకటేశ్వరపురం), జూన్ 24 : రాష్ట్రంలో వర్షాలు మొదలవడంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. జగనన్న పచ్చతోరణం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం అన్ని జిల్లాలకు భారీ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ నెలాఖరులోగానీ వచ్చే నెల మొదటి వారంలోగానీ ముఖ్యమంత్రి ‘పచ్చతోరణం’ను ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రతి గ్రామంలో ప్లాంటేషన్
జిల్లాలో 39.06 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో సింహభాగాన్ని ఫారెస్ట్ టెరిటోరియల్, డ్వామా శాఖలకు కేటాయించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2 కి.మీ. వంతున అవెన్యూ ప్లాంటేషన్ చేయనున్నారు. ఇలా డ్వామా ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల మొక్కలు, టెరిటోరియల్ విభాగం పర్యవేక్షణలో కంపా పథకం కింద 22 లక్షల మొక్కలు నాటనున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఆరు అటవీ రేంజ్‌ల పరిధిలో దాదాపు 1100 హెక్టార్లలో ప్లాంటేషన్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో 60 వేల మొక్కలు నాటనున్నారు.
వీటితోపాటు లైన్ డిపార్ట్‌మెంట్లు అయిన పోలీసు శాఖ 75 వేలు, ఉద్యానశాఖ 1.26 లక్షలు, కాలుష్య నియంత్రణ బోర్డు రెండు లక్షలు, డీఆర్‌డీఏ 10 వేలు, నెల్లూరు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు వేలు చొప్పున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా సామాజిక అటవీ విభాగం, టెరిటోరియల్ విభాగం ఆధ్వర్యంలోని 30 వీఎస్‌ఎస్‌లలో 56 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఆయా నర్సరీల్లో సూమారు 30 రకాల మొక్కలు సిద్ధం చేసి ఉన్నారు. ప్లాంటేషన్‌కు కావల్సిన అన్ని రకాల ఏర్పాట్లను సామాజిక అటవీ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ సారైనా సంరక్షిస్తారా?
పచ్చదనం పెంచడానికి సంబంధించి ఏటా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. భారీ సంఖ్యలో మొక్కలు నాటుతున్నా... సంరక్షణను గాలికి వదిలేస్తున్నారు. దీంతో అధికశాతం మొక్కలు నిర్జీవమవుతున్నాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటినట్లు లెక్కల్లో చూపుతున్నారు. అయితే వాటిలో బతికినవి ఎన్ని అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ నేపథ్యంలో పటిష్ట విధానాన్ని అమలు చేస్తేనే రాష్ట్రం ‘పచ్చ’గా ఉండే అవకావం ఉంది.
ఎవరు అడిగినా ఇస్తాం : ఎస్ రవిశంకర్, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వో
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరిత్యాలకు మొక్కల శాతం తగ్గి కాలుష్యం పెరగడమే కారణం. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా జిల్లాలో 39.6 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాము. స్వచ్ఛంద సంస్థలతోపాటు సామాన్యులు ఎవరు అడిగినా మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి.