చెరువులన్నీ నింపుతాం: సీఈ

ABN , First Publish Date - 2020-09-17T16:47:27+05:30 IST

సోమశిలకు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో జిల్లాలోని చెరువులన్నింటిని..

చెరువులన్నీ నింపుతాం: సీఈ

అనంతసాగరం(నెల్లూరు): సోమశిలకు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో జిల్లాలోని చెరువులన్నింటిని నింపనున్నట్లు ఇన్‌చార్జి సీఈ హరినారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం పది క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు  35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అంతకుముందు క్రస్ట్‌గేట్ల వద్ద ఇన్‌చార్జి సీఈ, ఎస్‌ఈ కృష్ణారావు, ఈఈ సురేష్‌ ప్రతేక పూజలు నిర్వహించారు. అనంతరం 5, 6, 8, 9, 10, 11, 12, 2, 3, 4 నెంబర్ల గేట్లు ఎత్తి నీరు డెల్టాకు వదిలారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నట్లు సీఈ పేర్కొన్నారు. ప్రస్తుతం 80 వేల క్యూసెక్కులు సోమశిలకు చేరుతోందని, ఐదు రోజుల్లో సోమశిల పూర్తి సామర్థ్యం నింపేవిధంగా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.


జలాశయ పరిధిలో రెండు పంటలకు నీరు ఇవ్వడంతోపాటు రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు చేసుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. లోతట్టు పెన్నా పరివాహక ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొన్నామని తెలిపారు. క్రస్ట్‌గేట్లు ఎత్తిన క్రమంలో ప్రమాదాలు జరగుకండా జలాశయం వద్ద ఆత్మకూరు సీఐ సోమయ్య, అనంతసాగరం, సోమశిల ఎస్‌ఐలు ప్రభాకర్‌, సుబ్బారావు తమ సిబ్బందితో పహారా ఏర్పాటు చేశామన్నారు. నీటి విడుదల కార్యక్రమా న్ని ఆత్మకూరు ఆర్డీవో సుగుణమ్మ, అనంతసాగరం తహసీల్దారు పద్మావతి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈలు సత్యప్రసాద్‌, సతీష్‌, జేఈ నిఖిల్‌ ఉన్నారు. పర్యాటకులు సోమశిలకు చేరుకొని అందాలు తిలకించారు. సోమశిలలో బుధవారం ఇన్‌ఫ్లో 71,300 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 42,000గా నమోదైంది.

 

కండలేరులో 36.885 టీఎంసీలు

రాపూరు : కండలేరు డ్యాంలో నీటి నిల్వ బుధవారం నాటికి 36.855 టీఎంసీలకు చేరుకుంది. సోమశిల నుంచి 10,148 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, డ్యాం నుంచి 70 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉన్నట్లు డ్యాం ఈఈ కిశోర్‌బాబు తెలిపారు. 


Updated Date - 2020-09-17T16:47:27+05:30 IST