‘స్మార్ట్’‌ కార్డులేవీ ?

ABN , First Publish Date - 2020-11-06T17:42:26+05:30 IST

వాహనాలు నడిపేందుకు అవసరమైన లైసెన్సులకు..

‘స్మార్ట్’‌ కార్డులేవీ ?

రవాణా శాఖలో నిలిచిపోయిన పంపిణీ

ఆరునెలలుగా కొరత.. వాహనదారుల ఇక్కట్లు

పట్టించుకోని ఆర్టీవో అధికారులు


తడ: వాహనాలు నడిపేందుకు అవసరమైన లైసెన్సులకు ఉపయోగించే స్మార్ట్‌కార్డులకు గ్రహణం పట్టింది. ఆరునెలలుగా పంపిణీ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. ఏదైనా వాహనం రోడ్డుపైకి రావాలన్నా, ఆ వాహనానికి సంబందించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతోపాటు ఇతరత్రా పత్రాలు ఉంటేనే అనుమతిస్తారు. అవిలేకుండా వాహనం నడిపితే జరిమానా విధిస్తారు. అయితే  వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, వ్యక్తిగత డ్రైవింగ్‌ లైసెన్సుల వంటివి స్మార్ట్‌కార్డు రూపంలో రవాణా శాఖ అందజేస్తున్నది. ఆర్‌సీలో ఆ వాహనానికి సంబంధించిన వివరాలు ఉండగా, డ్రైవింగ్‌ లైసెన్సు (డీఎల్‌)లో సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలతోపాటు ఆ వ్యక్తి నడపగలిగే వాహనాన్ని నిర్ధారిస్తూ  వివరాలు ఉంటాయి. వీటిని స్మార్ట్‌కార్డు రూపంలో పంపిణీ చేస్తారు. ఈ స్మార్ట్‌కార్డు పంపిణీ కోసం రవాణా శాఖ వాహనదారుల నుంచి  రూ.200 ముందుగానే చలానా రూపంలో వసూలు చేస్తుంది. ఇక సదరు వాహనదారుడి చిరునామా మారినప్పుడు, ఒక వాహనాన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి కొనుగోలు చేసినపుడు ఈ లైసెన్సులు వాటి ప్రకారం మార్చుకోవాలి. అప్పుడు కూడా ఈ స్మార్ట్‌ కార్డుల కోసం రెండు వందలు చెల్లించాల్సిందే. ఆటో, కారు, ఇతర వాహనాలకు రవాణా శాఖ ఇచ్చిన కాల పరిమితి తీరిన తరువాత సదరు వాహనానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను మంజూరు చేసే సమయంలోనూ ఈ స్మార్ట్‌కార్డులనే ఇవ్వాల్సి వుంటుంది. 


మే నెల నుంచి నిలుపుదల

ఈ స్మార్ట్‌కార్డుల సరఫరాను ప్రైవేటు సంస్థలకు టెండర్ల ప్రక్రియ ద్వారా రవాణా శాఖ అప్పగిస్తుంది.  ఆ సంస్థ నుంచి స్మార్ట్‌కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రవాణా శాఖ కార్యాలయాలకు చేరతాయి. అలా కార్యాలయాలకు వచ్చిన స్మార్ట్‌కార్డులను ప్రత్యేక యంత్రం ద్వారా ప్రింటింగ్‌ చేసి వాటిని ఆయా చిరునామాలకు పోస్టుద్వారా పంపుతారు. అయితే ఈ ఏడాది మార్చిలో టెండరు దక్కించుకున్న సంస్థ కాలపరిమితి తీరడంతో కార్డుల సరఫరాను నిలిపివేసింది. టెండరు కాలపరిమితికి ముందే వీటి టెండర్లు ఖరారు చేయాల్సిన అధికారులు పట్టించుకోలేదు. కరోనా లాక్‌డౌన్‌తో ఈ ప్రక్రియను పక్కన పెట్టేసింది. దీంతో మే నుంచి కార్డుల సరఫరా లేకపోవడంతో ఆర్టీవో కార్యాలయాలలోని అధికారులు చేతులెత్తేశారు. అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా వేలసంఖ్యలో స్మార్ట్‌కార్డుల లైసెన్సులు నిలిచిపోయాయి. దీంతో అధికారులు లైసెన్సుదారులకు ఆయా సర్టిఫికెట్‌లను, లైసెన్సులను జెరాక్స్‌ల రూపంలో ఇచ్చి వాటినే వినియోగించు కోవాలని సూచిస్తున్నారు. ఆ జెరాక్స్‌ లైసెన్సులకు రాష్ట్ర పరిధిలో అభ్యంతరాలు లేకపోయినా, పక్క రాష్ట్రాల్లో మాత్రం తిప్పలు తప్పడంలేదు. ముఖ్యంగా తమిళనాడులో ఈ జెరాక్స్‌లను అనుమతించమని అక్కడి అధికారులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ జెరాక్స్‌ కాఫీలు రోజల వ్యవధిలోనే పాడైపోతుండటంతో ఇక్కడ  అధికారులకు  సైతం వాటిని చూపించినా పట్టించుకోకుండానే జరిమానా విధిస్తున్నారు. దీంతో వాహనదారులు స్మార్డ్‌కార్డు లైసెన్సులను త్వరగా పంపిణీ చేయాలంటూ వేడుకుంటున్నారు. 


ఉన్నతాధికారులకు తెలిపాం..

స్మార్ట్‌ కార్డుల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. ప్రస్తుతం అందజేస్తున్న జెరాక్స్‌ కాపీలను అనుమ తించాలని ఆదేశాలు ఇచ్చాం. స్మార్ట్‌కార్డులు అందిన వెంటనే పంపిణీ చేస్తాం.

- మల్లికార్జున్‌రెడ్డి, ఆర్టీవో గూడూరు 


Updated Date - 2020-11-06T17:42:26+05:30 IST