ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి.. ఇంటిలోకి తీసుకెళ్లి..

ABN , First Publish Date - 2020-12-11T05:31:23+05:30 IST

చిన్నారిపై లైంగికదాడి చేసి పరారైన కామాంధుడిని దిశ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.

ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి.. ఇంటిలోకి తీసుకెళ్లి..
మాట్లాడుతున్న డీఎస్పీ నాగరాజు

నెల్లూరు(క్రైం), డిసెంబరు 10: చిన్నారిపై లైంగికదాడి చేసి పరారైన కామాంధుడిని దిశ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను దిశ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ యూ నాగరాజు విలేకర్లకు తెలిపారు. జాకీర్‌హుసేన్‌నగర్‌ న్యూకాలనీలో నజీర్‌హుసేన్‌ అలియాస్‌ మున్నా నివాసం ఉంటున్నాడు. ఇటీవలే అతను ఆ ప్రాంతంలో మరో ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటికి మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఈనెల 8వ తేదీ న్యూకాలనీలోని ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి కొత్త ఇంటిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఆదేశాల మేరకు దిశ డీఎస్పీ నాగరాజు కేసు దర్యాప్తు చేసి పరారీలో ఉన్న నిందితుడిని గురువారం ఫోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. ప్రజలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోని సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోరారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు స్వప్న, నాగశిరీష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:31:23+05:30 IST