ఆర్టీసీ టెండర్లలో అంతా సీక్రెట్‌

ABN , First Publish Date - 2020-12-16T05:06:30+05:30 IST

గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రీజియన్‌లోని ఆర్టీసీ డిపోల్లో ఖాళీగా ఉన్న స్టాల్స్‌కు టెండర్ల ప్రక్రియను మంగళవారం అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారు.

ఆర్టీసీ టెండర్లలో అంతా సీక్రెట్‌
సామాజిక దూరం పాటించకుండా నిలబడి ఉన్న టెండరుదారులు

గుట్టుచప్పుడు కాకుండా పక్రియ

ప్రధాన బస్టాండ్లలోని హోటల్‌పై అందరి కన్ను


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 15: గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రీజియన్‌లోని ఆర్టీసీ డిపోల్లో ఖాళీగా ఉన్న స్టాల్స్‌కు టెండర్ల ప్రక్రియను మంగళవారం అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారు. రీజియన్‌ వ్యాప్తంగా ఉన్న పది డిపోలలో ఖాళీగా ఉన్న 209 దుకాణాలకు 156 దరఖాస్తులు అందాయి. అయితే కావలి, నెల్లూరులోని ప్రధాన బస్టాండు, ఆత్మకూరు బస్టాండులో ఖాళీగా ఉన్న స్టాల్స్‌కే ఎక్కువ గా దరఖాస్తులు అందాయి. గతంలో స్టాల్స్‌కు టెండర్ల పక్రియ ప్రారంభమవుతున్న సమయంలో ఆర్‌ఎం స్థాయి అధికారులు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసి ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ప్రయత్నించేవారు. అయితే ఈసారి గుట్టుచప్పుడు కాకుండా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు ప్రఽధాన బస్టాండులో ఉన్న హోటల్‌ కోసం ఎందరో ప్రయత్నిస్తున్నారని, రాజకీయ నాయకుల సిఫార్సుల కోసమే గుట్టుచప్పుడు కాకుండా ప్రక్రియను సాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు టెండర్ల ప్రక్రియలో కరోనా నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. 

Updated Date - 2020-12-16T05:06:30+05:30 IST