వయసు మార్చి..పథకాన్ని దోచేశాడు !

ABN , First Publish Date - 2020-10-21T05:37:19+05:30 IST

ఆధార్‌కార్డులో వయసు మార్చి ప్రభుత్వ పథకాలను దోపిడీ చేసిన ఘటన మండలంలోని దాసరిపల్లిలో చోటుచేసుకొంది.

వయసు మార్చి..పథకాన్ని దోచేశాడు !

ఆధార్‌లో చేర్పులు, మార్పులు

‘జగనన్న చేయూత’లో అనర్హులకు పెద్దపీట

విజిలెన్స్‌ అధికారుల అదుపులో దాసరిపల్లి వాసి


ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 20: ఆధార్‌కార్డులో వయసు మార్చి ప్రభుత్వ పథకాలను దోపిడీ చేసిన ఘటన మండలంలోని దాసరిపల్లిలో చోటుచేసుకొంది. నెల్లూరులో ఆధార్‌కార్డుల్లో చేర్పులు, మార్పులు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్వాహా చేస్తున్నారనే సమాచారంతో ఇటీవల మీసేవ, ఆధార్‌ కేంద్రాలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్రమాలకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైనశైలిలో విచారించగా, అక్రమాలకు పాల్పడ్డ వారి వివరాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి మంండలం దాసరిపల్లిలో ఓ వ్యక్తి ఆధార్‌కార్డులో అధికంగా వయసు మార్చారని నిర్వాహకులు సూచించారు. దీంతో విజిలెన్స్‌ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా గ్రామానికి చేరుకొని ఆ వ్యక్తిని గత శుక్రవారం అరెస్టు చేసి నెల్లూరు తరలించారు. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. 


అనర్హులకు పెద్దపీట

జగనన్న చేయూత పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లు అందజేయనున్నది. అయితే పథకాన్ని వయసుతో ముడిపెట్టడంతో పలువురు పథకం లబ్ధిపొందేందుకు అడ్డదారులు తొక్కారు. అందులో భాగంగానే దాసరిపల్లికి చెందిన ఓ వ్యక్తి పంచాయతీలోని దాసరిపల్లి, వడ్లమూడి గ్రామాల్లో అనర్హుల వద్ద నుంచి నగదు తీసుకొని నెల్లూరులోని ఓ ఆధార్‌ కేంద్రంలో చేర్పులు, మార్పులకు పాల్పడ్డారు. 45 ఏళ్లులోపు ఉన్న వారికి 45 ఏళ్లపైన, 60 ఏళ్లపైన ఉన్న వారికి 60 ఏళ్లలోపు చేసి పథకాన్ని స్వాహా చేశారు. ఇలా మార్పు చేసినందుకు ఆఽధార్‌ కేంద్రం నిర్వాహకులు ఒక్కొక్కరికి రూ.4 నుంచి రూ.5 వేలు వసూలు చేసినట్లు సమాచారం. దాసరిపల్లి పంచాయతీలో 116 మందికి జగనన్న చేయూత పథకం లబ్ధి చేకూరగా అందులో 50 శాతం మంది అనర్హులే ఉన్నట్లు సమాచారం. ఆధార్‌లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని విజిలెన్స్‌ అధికారులు ఐదు రోజులుగా విచారిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-10-21T05:37:19+05:30 IST