పారదర్శకంగా జరిగేనా ?

ABN , First Publish Date - 2020-12-07T04:05:18+05:30 IST

రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ చేసే ట్రక్కు ఆటోలపై వైసీపీ కార్యకర్తల కన్నుపడింది.

పారదర్శకంగా జరిగేనా ?
ట్రక్కు ఆటోల ఎంపిక ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు (ఫైల్‌)

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలపై వైసీపీ కార్యకర్తల కన్ను

ట్రక్కు ఆటోల కోసం పైరవీలు

మొక్కుబడిగా అధికారుల ఇంటర్వ్యూలు

సిఫార్సుల కోసం నేతల వద్దకు పరుగు

అర్హుల ఎంపికపై ఎన్నో అనుమానాలు


సంగం, డిసెంబరు 6: రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ చేసే ట్రక్కు ఆటోలపై వైసీపీ కార్యకర్తల కన్నుపడింది. ఈ వాహనాలకు భారీ రాయితీ ప్రకటించడంతో వాటిని ఎలాగైనా దక్కించుకునేందుకు తమ నేతలతో సిఫార్సులు చేయిస్తున్నారు. దీంతో ఈ నెల 4వ తేదీన అధికారులు నిర్వహించిన ఇంటర్వ్యూలు  మొక్కుబడేనని కొంతమంది దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. నేతల సిఫార్సులు ఉన్నవారినే అర్హులుగా ఎంపిక చేయబోతున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో  లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేనా ? అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.


వచ్చే నెల నుంచి ఇంటి వద్దకే రేషన్‌


జిల్లాలో జనవరి నుంచి రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. బియ్యం డోర్‌ డెలివరీ చేయడానికి 524 ట్రక్కు ఆటోలు అవసరమని అధికారులు నిర్ణయించారు. అందుకు కావలసిన ట్రక్కు ఆటోలను భారీ రాయితీపై లబ్ధిదారులకు ఇవ్వడానికి  రంగం సిద్ధం చేశారు. డోర్‌ డెలివరీతోపాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ట్రక్కు ఆటోలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ, బ్యాంకు రుణంపై  అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ట్రక్కు ఆటో యూనిట్‌ విలువ రూ. 5,81,190లుగా పేర్కొన్నారు. ఇందులో రాయితీ 60శాతం అనగా రూ. 3,48,714లు, బ్యాంకు ద్వారా రుణం 30 శాతం అనగా రూ. 1,74,357లు, లబ్ధిదారుడి వాటా 10 శాతం రూ. 58,119లుగా నిర్ణయించారు. వీటిని ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 181 ట్రక్కు ఆటోలు, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా (ఐటీడీఏ) 73, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 125, ఈబీసీలకు 97, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌  ద్వారా 44, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ ద్వారా 4 ట్రక్కు ఆటోలను ఇచ్చేలా నిర్ణయించారు.


భారీ రాయితీపై కన్ను


ఒక్కో ఆటో విలువ రూ. 5,81,190లు కాగా అందులో ప్రభుత్వ రాయితీ రూ.3,48,714గా ఉంది. బ్యాంకు రుణం కూడా రూ. 1,74,357లు సమకూరుస్తారు. ఇక లబ్ధిదారుడు తన వాటాగా కేవలం రూ. 58,119 పెట్టుబడిగా పెడితే సరిపోతుంది. బ్యాంకు రుణాన్ని సులభ వాయిదాల్లో తీరిస్తే సరిపోతుంది. దీంతో సుమారు రూ. 3.5 లక్షల మేర లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా డోర్‌ డెలివరీ చేసినందుకు కనీసం ఎంత లేదన్నా నెలకు రూ. 12వేల నుంచి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీంతో పలువురు వైసీపీ కార్యకర్తలు ఈ ఆటోలపై కన్నేశారు. తమకు పరిచయం ఉన్న నేతల వద్దకు వెళ్లి సిఫార్సులు చేయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌తో ఆటోలు, ట్రాక్టర్లు నడుపుతున్న  వైసీపీ కార్యకర్తలు తాము ఎన్నికల్లో బాగా కష్టపడ్డామని, ఎలాగైనా సరే ఆ ట్రక్కు ఆటో తమకు ఇప్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే కొంత మంది నేతల  నుంచి హామీలు కూడా పొందారు. ఆ మేరకు గ్రామ నాయకులు జాబితా తయారు చేసి అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ఒకే గ్రామంలో వర్గాలు ఉన్న చోట్ల ఆయా ఎమ్మెల్యేల ఆదేశం మేరకు ఎంపిక చేయనున్నట్లు నేతలకు అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో అటువంటి గ్రామాల్లో అనుచరగణానికి వాటిని ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే వద్దకు పేర్లు తీసుకువెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాజకీయ పలుకుబడి లేని సామాన్యులు, దరఖాస్తు చేసి ఇంటర్వ్యూలకు వెళ్లి వచ్చినవారు అంతా కూడా  వృథా ప్రయాసేనన్న భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేనా ? అనే అనుమానాలు దరఖాస్తుదారుల్లో బలంగా  ఉన్నాయి.


Updated Date - 2020-12-07T04:05:18+05:30 IST