నగర వాసుల రిలాక్స్ !
ABN , First Publish Date - 2020-03-27T05:41:41+05:30 IST
జిల్లా అంతా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కొలువై ఉన్న నెల్లూరులో మాత్రం పరిస్థితి
నెల్లూరులో ఎటూ చూసినా జనమేజనం
మధ్యాహ్నం వరకు యథేచ్ఛగా రాకపోకలు
వాహనాలకు సైతం అనుమతి
ఆ తరువాత కట్టడి ?
లాక్‌డౌన్ వైఫల్యంపై వైద్యుల ఆందోళన
ఇలా అయితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడమెలా ?
పల్లెలోనే పకడ్బందీగా అమలు
నెల్లూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
జిల్లా అంతా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కొలువై ఉన్న నెల్లూరులో మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రిలాక్సేషన్ పేరుతో నిబంధనలు సడలించారు. దీంతో గుంపులు, గుంపులుగా జనం రోడ్లపై తిరుగుతున్నారు. ఒకవైపు కూరగాయల మార్కెట్ వెలవెల పోతుండగా, అదే సమయంలో కూరగాయల పేరు చెప్పి వీధుల వెంట జనం బలాదూర్‌గా తిరుగుతున్నారు. 25వ తేదీకి, 26వ తేదీకి పరిస్థితిని గమనిస్తే రోడ్లపై తిరిగే ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో పోలీసులు సైతం కట్టడి చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇలా గాలికి వదిలిస్తే ఏడాది పొడవునా ఇళ్లలో కూర్చున్నా వ్యాధి వ్యాప్తి తగ్గదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ నగరానికి ఏమయ్యింది ?
జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, చివరికి గ్రామాల్లో సైతం ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో మహా అయితే ఉదయం ఒకటి,రెండు గంటలు కూరగాయల మార్కెట్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. మిగిలిన సమయం అంతా పట్టణాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మండల, గ్రామీణ ప్రాంతాలైతే పక్కాగా లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరులో మాత్రం వేకువ జామున 3 నుంచి రాత్రి వరకు జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. యువకులు జట్లుజట్లుగా మోటారు వాహనాలపై వీధుల వెంట షికార్లు చేస్తున్నారు.
ఎవర్ని అడిగానా రెండే సమాధానాలు
పోలీసులు ఎవరిని అడిగినా రెండు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. కూరగాయల మార్కెట్‌కు వచ్చామని, లేదా మెడికల్ షాపునకు వచ్చామనే సమాధానాలు తప్ప మరో మాట వినిపించడం లేదు. మధ్యాహ్నం 12 గంటలకు అడిగినా కూరగాయల సాకే చెబుతున్నారు. ఇదే సమయంలో కూరగాయల మార్కెట్ ఏమో వెలవెలపోతుంటే, రోడ్లపై తిరిగే జనం మాత్రం మార్కెట్‌కు వెళ్లాలని, మార్కెట్ నుంచి వస్తున్నామని సమాధానం చెబుతున్నారు. పోలీసులు ప్రధాన రహదారులకు అడ్డంగా బారికేట్లు పెట్టినా, సందుగొందుల మార్గాలను వెదుక్కొని మోటారు సైకిళ్లపై యువకులు షికార్లు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెల్లూరు ప్రధాన రహదారులపై మోటారు సైకిళ్లు, కార్లు లెక్కలేనన్ని తిరుగుతూనే కనిపించాయి.
కొంప ముంచుతున్న రిలాక్సేషన్
25వ తేదీన ఉగాది కనుక సరుకుల కోసం ప్రజలు వీధుల్లోకి వచ్చే అవకాశం ఎక్కువ. అయితే అంతకు ముందు రోజు 8 గంటలకే నేటి అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అని ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో 24వ తేదీ రాత్రే పండుగ సరుకులు తెచ్చుకున్నారు. మిగిలిన వారు వేకువజామున 3 గంటలకు మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చుకున్నారు. ఉదయం 9 గంటలకంతా నగరం నిర్మానుష్యంగా మారింది. అదే రోజ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌డౌన్‌కు రిలాక్సేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. రాత్రి కంతా ఈ సమాచారం నగర ప్రజలకు తెలిసింది. ఇంకేముంది బయట తిరగడం హక్కుగా ఫీల్ అయ్యారు. ఫలితంగా ఉదయం 3 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎక్కడ చూసినా జనమే. పోలీసులు సైతం ఏమి అనలేని పరిస్థితి.
ఎంతవరకు సమంజసం ?
లాక్‌డౌన్ పేరుతో అన్ని ప్రభుత్వ సంస్థలను మూసేశారు. విద్యాసంస్థలకు సెలవులిచ్చేశారు. పరిశ్రమలు మూతేశారు. నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు తప్ప మిగిలిన అన్నింటిని మూయించేశారు. వీటి వెనుక ఉద్దేశం ఏమిటి ? ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం ద్వారా, కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్నదే. ఆర్టీసీ, రైళ్ల రాకపోకలకు బ్రేకులు వేయించి, వేలాది మంది ఉద్యోగుల పని గంటలు కుదించి, వేలాది పరిశ్రమల ఉత్పత్తులను నిలిపివేసి, వేలాది దుకాణాలకు తాళాలు వేయించినా, ఏది జరగకూడదని తాళాలు వేయించారో అదే జరుగుతున్నది. ఇక లాక్‌డౌన్‌కు అర్థం ఏమిటి? అనే విషయాన్ని అటు ప్రభుత్వం కాని, ఇటు ఉన్నతాధికారులు కాని ఆలోచించకపోవడం శోచనీయం. అంత మాత్రానికి పోలీసులను రేయింబవళ్లు వీధుల వెంట నిలబెట్టడం ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇది ఎంత ప్రమాదమో తెలుసా..!?
ఇదేమీ రిలాక్సేషన్..? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలను వదిలేసి ఆ తరువాత కట్టడి చేయడం వల్ల ఏమి ఉపయోగం. అసలు ఈ వ్యాధి ఎంతవేగంగా వ్యాప్తి చెందుతుందో, వ్యాధిబారిన పడిన వారిని ఎంత బాధిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదనుకుంటా... ప్రమాదకరమైన ఈ వైరస్ విషయంలో ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తే ఎలా.!? అసలే నగరంలో వైద్య సదుపాయాలు చాలా తక్కువ. అన్ని ఆసుపత్రులు కలుపుకుంటే 20కి మించి వెంటిలేటర్లు లేవు. ఒకసారి ఈ వ్యాధి ప్రబలితే వందల సంఖ్యలో వెంటిలేటర్లు కావాలి. అవి ఉంటేనే సరిపోదు. చికిత్స అందించడానికి ట్రైన్డ్ పీపుల్ కావాలి. ఎక్కడి నుంచి తేవాలి. దీనికి ఒక్కటే మార్గం. వైరస్ ప్రబలకుండా జాగ్రత్త పడాలి. అందరూ ఇళ్లకే పరి మితం కావాలి. కట్టడి చేయగలిగితే పకడ్బందీగా చేయండి. లేకుంటే ఎవరి కర్మకు వారిని వదిలేయండి. నగరంలో ప్రజలు తిరుగుతున్న తీరును చూసి బాధతో, భయంతో ఈ మాటలు చెబుతున్నా.
డాక్టర్ యశోధర