వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి

ABN , First Publish Date - 2020-03-13T10:06:24+05:30 IST

మండల ప్రజా పరిషత్‌ కార్యాల యంలో గురువారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో వివాదం చోటుచేసుకుంది.

వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి

ఇద్దరి నామినేషన్ల తిరస్కరణ

తొలుత ఆమోదం.. తర్వాత నో

చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు టీడీపీ ఫిర్యాదు


విడవలూరు, మార్చి 12: మండల ప్రజా పరిషత్‌ కార్యాల యంలో గురువారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో వివాదం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాదోప వాదాలు జరిగాయి. రామతీర్థం ఎంపీటీసీ స్థానానికి టీడీపీ బలపరిచిన దళిత వర్గానికి చెందిన మర్లపాటి అరుంధతి, సాయి వెంకమ్మలు తొలుత నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారిని వైసీపీ నాయకులు నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని బెదిరింపు లకు దిగడంతో శంభుని కాపు వర్గానికి చెందిన నాటారు భాగ్యమ్మ, పురిణి శిరీషాలు నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో నలుగురు వేసిన నామినేషన్లు సజావుగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. 


వైసీపీ నేతల ఒత్తిడితో..

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన అశోక్‌, మురళీ వర్గీయులు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని అధికారులపై బెదిరింపులకు దిగారు. శంభుని కాపులు ఎస్సీలు కాదని వారి నామినేషన్లను తిరస్కరించాలని ఎన్నికల అధికారి శ్రావణ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో టీడీపీ నాయకులు శంభుని కాపులు ఎస్సీలు కాకపోతే ఎన్నికల అధికారి ఎలా ధ్రువీకరిస్తారని వాదనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.


శంభుని కాపులు ఎస్సీలు కాదని రాతపూర్వకంగా ఇవ్వాలని ఎన్నికల అధికారిని టీడీపీ నాయకులు కోరటంతో ఎన్నికల అధికారి శంభుని కాపులు ఎస్సీలు కాదని అందువల్ల నామినేషన్లు తిరస్కరిస్తూ రాత పూర్వకంగా పత్రాన్ని అందజేశారు. దీంతో టీడీపీ నాయకులు నాటారు విజయకుమార్‌, నాటారు వెంకటే శ్వర్లు, పురిణి నాగేంద్ర తదితరులు నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. త్వరితగతిన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంద ర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తొలుత శంభుని కాపులు ఎస్సీలుగా పరిగిణించిన అధికారులు వైసీపీ నాయకులు ఒత్తిడులకు తలొగ్గారని ఆరోపించారు. ఎన్నికల అధికారి అధికార పార్టీకి కొమ్ముకాయటం సరికాదన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని, వైసీపీ నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. 

Updated Date - 2020-03-13T10:06:24+05:30 IST