మిగిలేది శ్రమేనా..!

ABN , First Publish Date - 2020-02-12T09:14:34+05:30 IST

పుష్కలంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టులు నిండడంతో భారీగా వరి సాగుచేసిన అన్నదాతలకు చివరకు నిరాశే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనంత స్థాయిలో పంట వేసినా వాతావరణం

మిగిలేది శ్రమేనా..!

సాగు పెరిగినా తగ్గిన వరి దిగుబడి

మార్కెట్‌లో ధరలూ అంతంత మాత్రమే

పెట్టుబడికే సరిపోయిందని రైతుల ఆవేదన

పూర్తిస్థాయిలో ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు

ప్రారంభమైనా మిల్లుల అటాచ్‌మెంట్‌ ఏదీ?


నెల్లూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : పుష్కలంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టులు నిండడంతో భారీగా వరి సాగుచేసిన అన్నదాతలకు చివరకు నిరాశే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనంత స్థాయిలో పంట వేసినా వాతావరణం అనుకూలించక దిగుబడులు భారీగా తగ్గుతున్నాయి. సాధారణంగా ఏటా ఎకరాకు మూడన్నర నుంచి నాలుగు పుట్ల ధాన్యం దిగుబడి వచ్చేది. అయితే ఈ సారి మాత్రం మూడు పుట్లే వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అంతకన్నా తక్కువగా కూడా వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. దిగబడి తగ్గినా కనీసం ధరలైనా ఆశాజనకంగా ఉంటే ఎంతో కొంత ఆదాయం వస్తుందిలే అనుకున్న కర్షకులకు అక్కడ కూడా భంగపాటు తప్పడంలేదు. మార్కెట్లో ధాన్యం ధరలు ఆశించిన స్థాయిలో లేవు. ప్రభుత్వం మద్దతు ధర రూ.15,500 పైనే కల్పిస్తుండగా మార్కెట్లో మాత్రం రూ.14,500 దాటడం లేదు. అది కూడా బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలకు మాత్రమే ఆ ధర ఉంది. ఇక జిల్లాలో ఎక్కువగా సాగు చేసిన ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకం ధరలు మరీ దారుణంగా ఉన్నాయి. పుట్టి రూ.12 వేల నుంచి రూ.12,500 మాత్రమే పలుకుతోంది. దీంతో అటు దిగుబడి రాక, ఇటు ధర లేక రైతు కుదేలవుతున్నాడు. ఐదు నెలలు కష్టపడితే తమకు శ్రమ మాత్రమే మిగిలిందని వాపోతున్నారు. ముందుగా నాట్లు వేసిన తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు, కోట, బాలాయపల్లి, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి డెల్టాలో కూడా కోతలు ఊపందుకోనున్నాయి. నాన్‌ డెల్టా ప్రాంతంలో పరిస్థితులు దయనీయంగా ఉండగా డెల్టా ప్రాంతంలో ఎలా ఉంటుందోనని ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. 


పెరిగిన పెట్టుబడి

ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి పండించారు. అందులో సుమారు 60 శాతం వరకు ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకాన్ని వేశారు. ఈ దఫా నవంబరు, డిసెంబరు నెలల్లో ఒకేసారి నాట్లు వేయడంతో కూలీ రేట్లు పెరిగాయి. అలానే వాతావరణం ప్రభావం కారణంగా మందుల వాడకం కూడా పెరిగింది. దీని మూలంగా గతంలో ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి అవుతుండగా ఈ సారి రూ.5వేలు ఎక్కువగా ఖర్చయిందని రైతులు అంటున్నారు. ఇప్పుడు వరికోతలు కూడా ఒకేసారి జరుగుతుండడంతో కోత యంత్రాలకు డిమాండ్‌ ఏర్పడి ధరలు పెంచినట్లు చెబుతున్నారు. వీటన్నింటిని చూస్తుంటే వచ్చిన దిగుబడి మొత్తం పెట్టుబడికే సరిపోతుందని అర్థమవుతోంది. సాధారణంగా కోతలు మొదలైన కొత్తల్లో ధాన్యం ధరలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ధరలు తక్కువగా ఉన్నాయి. ఎందుకిలా అని వ్యవసాయ నిపుణులను సంప్రదిస్తే రెండు కారణాలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సారి వరి సాగు ఎక్కువగానే జరగడం, ఇదే సమయంలో జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేయడానికితోడు దళారులు కూడా ధరలు తగ్గేందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కోసిన ధాన్యాన్ని కల్లాల్లో ఉంచుకోలేక రైతులు ఎంతోకొంతకు తెగనమ్ముకుంటున్నారు. 


ఇంకా అటాచ్‌కాని మిల్లులు

ఈ దఫా భారీగా వరి సాగైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొదటి నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గతేడాది 99 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ సారి 165 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల మొదటి వారం నుంచి నాలుగో వారంలోపు వీటన్నింటినీ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కోతలు జరుగుతున్న గూడూరు, నాయుడుపేట డివిజన్లలో తొలుత కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఇంకా కొన్ని కేంద్రాలకు మిల్లులను అటాచ్‌ చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వలేదని సమాచారం. దీని మూలంగా ధాన్యాన్ని అమ్మేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళుతున్నప్పటికీ ఇంకా మిల్లులు అటాచ్‌ కాలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అయితే ధాన్యం నిల్వ ఉంచుకునే కొద్దీ తూకం తగ్గిపోతుందని భయపడుతున్న రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇప్పుడే కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి ఇలా ఉంటే ఇక కోతులు ఊపందుకుంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ మిల్లులను అటాచ్‌ చేయకపోతే ఉపయోగం ఉండదు కాబట్టి అధికారులు వీలైనంత త్వరగా మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


మిల్లులు అటాచ్‌ చేస్తున్నాం ..రోజ్‌మాండ్‌, సివిల్‌ సప్లయిస్‌ డీఎం

జిల్లాలో 35 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాలకు మిల్లులను అటాచ్‌ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే రూ.7 కోట్ల వరకు మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారు. ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 165 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 


ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కట్టా శ్రీనివాసులు. నెల్లూరు రూరల్‌ మండలం కొత్త వెల్లంటి గ్రామం. తనకున్న పదకొండు ఎకరాల్లో ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకం వరి సాగు చేశాడు. ఎకరాకు మూడు పుట్లు చొప్పున దిగుబడి వచ్చింది. ఆ గ్రామంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ మిల్లులు కేటాయించకపోవడంతో ధాన్యం దాచుకునేందుకు సదుపాయం లేక ప్రైవేటు వ్యక్తులకు పుట్టి రూ.12,700 చొప్పున అమ్ముకున్నాడు.


ఇతని పేరు శ్రీనివాసులు. దొరవారి సత్రం మండలం ఎన్‌ఎం అగ్రహారానికి చెందిన రైతు. ఆయన ఐదెకరాల పొలంలో నెల్లూరు మసూర రకం వరి సాగు చేశారు. జనవరి 4, 5 తేదీల్లో కురిసిన వర్షానికి అంతా నేలకొరిగింది. వర్షం వల్ల వరి కంకుల్లో సుంకు రాలిపోయింది. దాంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. సరాసరి ఎకరానికి 18 బస్తాలే వచ్చింది. కోతలతో కలిపి ఒక ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి తగ్గడంతో కనీసం ఆ పెట్టుబడి కూడా రాలేదు.

Updated Date - 2020-02-12T09:14:34+05:30 IST