-
-
Home » Andhra Pradesh » Nellore » Rayateeki mangalam
-
సూక్ష్మపోషకాల రాయితీకి మంగళం!
ABN , First Publish Date - 2020-12-20T04:49:18+05:30 IST
ఆరుగాలం కష్టపడే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పథకానికి రాయితీలను రద్దు చేస్తూ వస్తోంది. సూక్ష్మ పోషకాల పథకం కూడా అందులో చేరింది.

గత ప్రభుత్వంలో ఉచితంగా సరఫరా
వైసీపీ ప్రభుత్వంలో నిలిపివేత
అన్నదాతలపై అదనపు భారం
భూసారం, పంట దిగుబడులపై ప్రభావం
సంగం, డిసెంబరు 19 : ఆరుగాలం కష్టపడే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పథకానికి రాయితీలను రద్దు చేస్తూ వస్తోంది. సూక్ష్మ పోషకాల పథకం కూడా అందులో చేరింది. ఒకవైపు నివర్ తుఫాన్‌తో నారుమళ్లు, నాట్లు దెబ్బతిని రెండోసారి సాగు చేపట్టాల్సిన పరిస్థితిలో వ్యయం పెరగనుంది. దీంతో పోషకాల ఎరువులు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి రావడంతో అన్నదాతపై భారం పడనుంది. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించేది. వాటి ద్వారా ఉచితంగా జిప్సం, జింకు, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను అందించేవారు. ప్రస్తుతం ఇది కూడా మొక్కుబడిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది రబీ సీజన్ నుంచి సూక్ష్మ పోషకాల ఉచిత పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పోషకాలు కావలసిన రైతులు పూర్తి నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. రైతు భరోసా కింద రైతులకు రూ.13,500 ఇస్తున్నాం.. వాటితో పోషకాల ఎరువులు కావాల్సిన రైతులు కొనుగోలు చేసుకోవాలని చెబుతోంది.
5 లక్షల ఎకరాలకుపైగా వరిసాగు
జిల్లాలో పుష్కలంగా సాగునీరు ఉండటంతో ఈ ఏడాది జిల్లాలోని డెల్టా, నాన్‌డెల్టాలోని చెరువుల కింద విస్తారంగా వరి సాగయ్యే పరిస్థితి ఉంది. సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతుంది. ఇప్పటికే కొన్ని మండలాల్లో సాగు చేశారు. మరికొన్ని మండలాల్లో నార్లు సిద్ధం చేసి నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే సాగుకు ముందే మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేసి ఫలితాలు చెప్పాల్సి ఉన్నా ఈ ఏడాది ఆ ఊసే లేదు. దీంతో అవసరమైన రైతులు ఇటీవల స్వయంగా తమ పొలంలో మట్టిని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లి ఫలితాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో భూసార పరీక్ష మినీకిట్లు ఉన్నా అవి అలంకార ప్రాయంగా మారాయి.
దిగుబడులపై ప్రభావం
సూక్ష్మపోషకాలపై రాయితీ ఎత్తేయడంతో పోషకాల ఎరువులు వేయకపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపిందని అన్నదాతలు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో కూడా ఇదే పరిస్థితి. రబీ సీజన్ ప్రారంభమైనా ఇంతవరకు రాయితీకి సంబంధించి కనీస ప్రస్తావన కూడా తేవకపోవడంతో రాయితీ పోషకాలకు నీళ్లొదినట్లేనని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రైతులపై అదనపు భారం
2019 రబీ సీజన్‌లో ఉచితానికి తిలోదకాల్చి 50 శాతం రాయితీపై రైతులకు పోషకాలను అందచేశారు. జిల్లాలో ఏడాదికి వందల మెట్రిక్ టన్నుల జిప్సంతో పాటు జింక్ సల్ఫేట్, బోరాన్‌లను గత ప్రభుత్వం ఉచితంగా అందించేది. ఇప్పుడు కావాల్సిన వారు మొత్తం ధర చెల్లించి కొనాల్సి రావడంతో అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను జింకు రూ.6 వేలు, జిప్సం టన్ను మూడు వేలు పైనే పలుకుతున్నాయి. అదే బోరాన్ టన్ను రూ.10 వేలు పలుకుతోంది. గతంలో ఒక్కో రైతుకు రెండు వేల నుంచి మూడువేల దాకా విలువైన పోషకాలను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేసేవారు. కీలకమైన ఈ పథకానికి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడడంతో పంట దిగుబడులపై పడుతుంది.
దిగుబడి తగ్గింది
పోషకాలు లోపిస్తే పంట దిగుబడిపై ప్రభావం తప్పదు. కానీ అలా అని పోషకాలకు కొనుగోలుకు అదనపు ఖర్చులు భరించలేక వాటి జోలికి వెళ్లడంలేదు. దీంతో గత రబీ సీజన్‌లో దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు నాలుగు పుట్లు అయ్యే పొలం మూడు పుట్లు కూడా కాలేదు.
- రమణారెడ్డి, సంగం
పోషకాలు ఉచితంగా అందించాలి
చౌడు భూములను సారవంతగా మార్చి దిగుబడులను పెంచే జింక్ సల్ఫేట్, జిప్సం, బోరాన్ వంటి పోషకాల ఎరువులను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలి. లేకపోతే రైతు భరోసా సాయం పోషక ఎరువులకే సరిపోతుంది. సాగు పెట్టుబడికి మళ్లీ రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి రైతులపై అదనపు భారం పడుతుంది.
- శ్రీనివాసులు చౌదరి, సంగం