-
-
Home » Andhra Pradesh » Nellore » R and B
-
ఆర్‌అండ్‌బీకి ఎస్‌ఈ కావలెను..!
ABN , First Publish Date - 2020-12-07T04:08:41+05:30 IST
కీలకమైన రహదా రులు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖపై జిల్లాలో పర్యవేక్షణ కొర వడింది.

రెండేళ్లుగా ఇన్‌చార్జి పాలన
ఇప్పటికే నలుగురి మార్పు
రూ. వందల కోట్ల పనులకు టెండర్లు
తుఫాన్ దెబ్బకు భారీగా దెబ్బతిన్న రోడ్లు
శాఖపై కొరవడిన పర్యవేక్షణ
వెల్లువెత్తుతున్న ఆరోపణలు
నెల్లూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కీలకమైన రహదా రులు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖపై జిల్లాలో పర్యవేక్షణ కొర వడింది. రెండేళ్లుగా రెగ్యులర్ ఎస్‌ఈ లేకపోవడంతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రూ.వందల కోట్ల టెండర్లు జరుగుతున్నా అంతా ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. 2018లో రెగ్యులర్ ఎస్‌ఈ పదవీ విరమణ చేశాక అప్పటి నుంచి ఇప్పటికి నలుగురు ఇన్‌చార్జిలు మారారు. మొదట కడప ఎస్‌ఈకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తర్వాత గూడూరు ఈఈ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత కావలి ఈఈకు అప్పగించారు. ఆయన ఇటీవల పదవీ విరమణ చేయడంతో మళ్లీ నెల్లూరు ఈఈకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా ఇన్‌చార్జిలను నియమిస్తు న్నారే తప్ప రెగ్యులర్ ఎస్‌ఈను నియమిద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి లేనట్లుగా కనిపిస్తోంది.
పర్యవేక్షణ లేక..
ప్రస్తుతం జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.వందల కోట్లకు టెండర్లు జరుగుతున్నాయి. కొన్ని ఇప్పటికే పూర్తవగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. రెగ్యులర్‌గా పర్యవేక్షించే అధికారి లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది గాడి తప్పుతు న్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల జరుగుతున్న ప్రతీ టెండర్ విషయంలో ఏదో ఒక ఆరోపణ వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఎన్‌డీబీ కింద సుమారు రూ.90 కోట్లతో టెండర్లు పిలిచారు. త్వరలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాల్సి ఉంది. ఈ పనులకు కొన్ని నెలల క్రితం టెండర్లు పిలిచినప్పటికీ నిబంధనల్లో మార్పులు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో వాటిని రద్దు చేసి ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలిచారు. అలానే రూ.41 కోట్లతో కావలి ప్రధాన రహదారి అభివృద్ధికి పిలిచిన టెండర్లకు ఇంతవరకు రివర్స్ టెండరింగ్ నిర్వహించలేదు. ఈ వ్యవహారంలో అధికారులపైనే ఆరోపణలు వినిపిస్తుండడం గమనార్హం. పొదలకూరు రోడ్డు అభివృద్ధికి పిలిచిన టెండరులోనూ, నూతన కోర్టు భవనాల నిర్మాణానికి పిలిచిన టెండర్ల సమయంలోనూ కూడా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వినిపించాయి. కాగా ఇటీవల నివర్ తుఫాన్ దెబ్బకు జిల్లాలో వందల కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ నష్టాన్ని సకాలంలో పూర్తిస్థాయిలో అంచనా వేయడంలో కూడా అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. వీటన్నింటికీ నిరంతరం పర్యవేక్షించేందుకు రెగ్యులర్ ఎస్‌ఈ లేకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు దెబ్బతిన్న రోడ్లన్నింటినీ త్వరగా పునరుద్ధరించాల్సి ఉంది. నెల్లూరు ఈఈకి ఆయన పరిధిలోని వ్యవహారాలు పర్యవేక్షించేందుకు సమయం సరిపోతుంది. అలాంటప్పుడు జిల్లా మొత్తం బాధ్యతలు ఈఈకు అప్పగిస్తే ఎంత సమర్థవంతంగా నిర్వహించగలరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు టెండర్ల కోసం రెగ్యులర్ ఎస్‌ఈను నియ మించకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి.