గాలిలో ప్రజారోగ్యం..

ABN , First Publish Date - 2020-05-29T10:45:19+05:30 IST

‘‘రాష్ట్రంలో వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తాం. ప్రజారోగ్యాన్ని మెరుగుపరుస్తాం. పేదలకు వైద్యం కోసం పైసా ..

గాలిలో ప్రజారోగ్యం..

వైద్య రంగంలో సంస్కరణ లేవి!?

నెరవేరని హామీలు అమలు

కొలిక్కిరాని ‘ఆరోగ్యశ్రీ’ వ్యాధుల గుర్తింపు 

జీజీహెచ్‌లో ఎమ్మారై, సిటీస్కాన్‌లూ కరువే!

భర్తీకాని వైద్యులు, సిబ్బంది పోస్టులు

108, 104 కొత్త వాహనాలు ఎప్పుడొస్తాయో!?

పీహెచ్‌సీలలో కనీస పరీక్షల్లేవు


నెల్లూరు (వైద్యం), మే 28 : ‘‘రాష్ట్రంలో వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తాం. ప్రజారోగ్యాన్ని మెరుగుపరుస్తాం. పేదలకు వైద్యం కోసం పైసా ఖర్చు లేకుండా అన్నీ ప్రభుత్వమే చేపడుతుంది.’’ ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకపక్షం ఇచ్చిన హామీ. అయితే ఇది ఎంతవరకు నెరవేరిందో మన కళ్లముందే కనబడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యం అందక వాటిపై నమ్మకం కోల్పోతున్న నిరుపేదలు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్‌ దోపిడీకి అప్పుల పాలవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు అందుబాటులో ఉండని దుస్థితి నెలకొంది. ఒకవేళ వైద్యులు ఉన్నా అవసరమైన మందులు ఆసుపత్రిలో ఉండటం లేదు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద  ఏడాదికి రూ.34 కోట్లకుపైగా జిల్లాలో వైద్య రంగం కోసం ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం దక్కడం లేదు. 


పార్లమెంట్‌ నియోజకవర్గానికో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా పీహెచ్‌సీ స్థాయిలో వైద్య సేవలు మెరుగుపడకుండా వైద్య కళాశాలలు పెట్టి ఏం ప్రయోజనమనే విమర్శలు లేకపోలేదు. జిల్లావ్యాప్తంగా 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 477 ఆరోగ్య ఉపకేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 27 వరకు 24 గంటల ఆసుపత్రులు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వంటి పెద్ద నెట్‌ వర్క్‌ ఉన్నా ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న విమర్శలు. ఇక వైద్య ఆరోగ్యశాఖలో 250 మంది కాంట్రాక్టు వైద్య సిబ్బంది ఉండగా వారిని రెగ్యులర్‌ చేస్తామన్న సీఎం జగన్‌ హామీ ఇప్పటికీ నెరవేరలేదు.


కరోనా విజృంభణతో..

మహమ్మారి కరోనా కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం ఆశించిన స్థాయిలో అందడం లేదు. ప్రైవేట్‌ ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రాథమిక వైద్యం అందించే పీఎంపీ, ఆర్‌ఎంపీలు వైద్యసేవలను కట్టడి చేయటంతో వైద్యం అందక రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. కనీసం నెల్లూరులోని జీజీహెచ్‌ ఆసుపత్రిలో కూడా సాధారణ రోగాలకు వైద్యం అందడం లేదు. ఈ పరిస్థితిలో ఇటీవల ఇద్దరు రోగులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడ్డారు.


ఆరోగ్యశ్రీ వ్యాధుల గుర్తింపేది!?

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులను చేరుస్తామని గతంలో వైసీపీ అధినేత జగన్‌ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికీ అమలు కాలేదు. వెయ్యి రూపాయల దాటిన వైద్యం ఖర్చులను ఆరోగ్యశ్రీలోకి చేరుస్తామని దశలవారీగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామంటూ మొదటిగా గత జనవరిలో పశ్చిమ గోదావరిలో ప్రారంభించారు. ఇది జరిగి 5 నెలల పూర్తి కావస్తున్నా నేటికి జిల్లాలో అమలులోకి రాలేదు. గోదావరి జిల్లాలో 2059 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేస్తుండగా జిల్లాలో మాత్రం 1259 వ్యాధులకు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయి.


ఏడాదికి ఒక కుటుంబంలో ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు వైద్యసేవలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం రూ.5 లక్షల వరకు మాత్రమే వైద్యసేవలు అందుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో వచ్చే ప్రాణాంతక డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేరుస్తామని ఇచ్చిన హామీ నేటికి అందుబాటులో రాలేదు. కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో పలు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు వెనుకాడుతున్నాయి.


పేరుకే జీజీహెచ్‌ 

జిల్లాకే తలమానికంగా నిలుస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిని 750 పడకలకు పెంచి రూ.360 కోట్లతో నిర్మించామని పాలకులు   చెబుతున్నా ఇందులో ప్రజారోగ్యం ఆశించిన స్థాయిలో అందడం లేదు. జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి ఆళ్లనాని జీజీహెచ్‌లో అత్యవసరమైన ఎమ్మారై, సిటీ స్కాన్‌ వంటి పరికరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఇద్దరు ఉన్నా కేవలం రూ.10 కోట్లు ఖర్చు చేస్తే వచ్చే వైద్య పరికరాలపై ఇలాంటి నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారుతోంది. ఇక వైద్యులు, సిబ్బంది నియామకాలు నేటికి పూర్తికాలేదు.


108, 104 అంబులెన్స్‌ల సేవలు అంతంతే

కుయ్‌... కుయ్‌ మంటూ 108 అంబులెన్స్‌ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించేలా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ అంబులెన్స్‌ సేవలను అందుబాటులో తెచ్చారు. గత ప్రభుత్వంలో కూడా వీటి సేవలు బాగా నడిచాయి. ప్రస్తుతం 30 వరకు 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నా వీటిలో చాలా వరకు మరమ్మతుకు నోచుకోలేదు. అలాగే 104 సంచార వైద్య సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు, గర్భవతులకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. మండలానికి ఒక 108, 104 అంబులెన్స్‌ల ఏర్పాటు ఎప్పటికి పూర్తవుతుందో అంతుపట్టడం లేదు. 


పీహెచ్‌సీలలో కనీస పరీక్ష లేవి?

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరీక్షలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. మలేరియా, డెంగ్యూ వంటి పరీక్షలు చేయడం లేదు. ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేయకపోవడమే ఇందుకు కారణమవుతోంది. పీహెచ్‌సీలు పూర్తిస్థాయిలో ప్రజలకు అంబాటులో ఉంటాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆస్థాయిలోకి రాలేదు. సచివాలయాల్లో ఏఎన్‌ఎంల నియామకం చేపట్టినా వారు వైద్య శాఖ నియంత్రణలో లేకపోవడంతో వారి సేవలు గ్రామీణులకు అందడం లేదు. కేవలం సచివాలయాలకు పరిమితమవుతున్నారు.


ప్రజావైద్యం అపహాస్యం .. ఎల్లంకి వెంకటేశ్వర్లు, పౌరహక్కుల జిల్లా అధ్యక్షుడు

జిల్లాలో పాలకుల అలక్ష్యం వల్ల ప్రజారోరాగ్యనికి విఘాతం ఏర్పడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యసేవలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. కనీస వైద్య పరీక్షలు కూడా అందుబాటులో లేవు. ఆరోగ్యశ్రీలో అన్ని వ్యాధులకు ఉచిత వైద్యం అందక ఎంతోమంది పేదలు ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
సంస్కరణలు అవసరం 

జిల్లాలో ప్రాథమిక స్థాయిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల కాదు.. ముందు పీహెచ్‌సీలలో మెరుగైన వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలి. ప్రత్యేకించి వైద్యులు, సిబ్బంది ఖాళీలను త్వరగా భర్తీ చేయాలి. విలేజ్‌ క్లినిక్‌ల వల్ల ఎంతో ఉపయోగం ఉన్నా మందుగా పీహెచ్‌సీలలో మెరుగైన వైద్యం అవసరం.

- డాక్టర్‌ ఎంవీ రమణయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2020-05-29T10:45:19+05:30 IST