27 యేళ్లు... 52 ప్రయోగాలు.. 50 విజయాలు

ABN , First Publish Date - 2020-12-18T04:29:33+05:30 IST

ఇస్రో అమ్ములపొదిలో రామబాణం వంటి ధ్రువ ఉపగ్రహ..

27 యేళ్లు... 52 ప్రయోగాలు.. 50 విజయాలు
షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళుతున్న పీఎస్‌ఎల్వీ-సీ50 రాకెట్‌

అర్థశత విజయం.. పీఎస్‌ఎల్వీ సొంతం 


శ్రీహరికోట(ఆంధ్రజ్యోతి): ఇస్రో అమ్ములపొదిలో రామబాణం వంటి ధ్రువ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్‌ఎల్వీ-సీ50) అర్ధశత విజయాన్ని గురువారం సగర్వంగా నమోదు చేసింది. 1993, సెప్టెంబరు 20న షార్‌ నుంచి తన గగనయాత్రను ప్రారంభించిన ఈ రాకెట్‌ గురువారం ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ50తో కలిపి 52 సార్లు రోదసిలోకి పయనించింది. వీటిలో 1993లో తొలి రాకెట్‌ పీఎస్‌ఎల్వీ-డీ1, 2017లో పీఎస్‌ఎల్వీ-సీ39 రాకెట్లు మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేక విఫలమయ్యాయి. మిగిలిన 50 పీఎస్‌ఎల్వీలు విజయవంతంగా గమ్యాన్ని చేరుకోవడం ఈ రాకెట్‌పై ఇస్రో పట్టుకు నిదర్శనం. 


అంచెలంచెలుగా...

పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ఇస్రో అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంది. పీఎస్‌ఎల్వీ-జీ (జనరిక్‌), పీఎస్‌ఎల్వీ-సీఎ (కోర్‌అలోన్‌), పీఎస్‌ఎల్వీ-ఎక్స్‌ఎల్‌, పీఎస్‌ఎల్వీ-డిఎల్‌, పీఎస్‌ఎల్వీ-క్యూఎల్‌ రాకెట్లుగా అభివృద్ధి చేశారు. ఇప్పటికి 12 పీఎస్‌ఎల్వీ-జీ, 14 పీఎస్‌ఎల్వీ-సీఎ, 22 పీఎస్‌ఎల్వీ-ఎక్స్‌ఎల్‌,  రెండు పీఎస్‌ఎల్వీ-డీఎల్‌,  రెండు పీఎస్‌ఎల్వీ-క్యూఎల్‌ రాకెట్లను ఇస్రో ప్రయోగించింది. వీటిలో ఒక పీఎస్‌ఎల్వీ-జీ,  ఒక పీఎస్‌ఎల్వీ-ఎక్స్‌ఎల్‌ రాకెట్లు మాత్రం విఫలమయ్యాయి. 


349 ఉపగ్రహాలు కక్ష్యలోకి...

పీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారా ఇస్రో ఇప్పటికి 439 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేరవేయడం ఈ రాకెట్‌ సామర్థ్యానికి నిదర్శనం. వీటిలో 111 స్వదేశీ ఉపగ్రహాలు, 328 విదేశీ ఉపగ్రహాలు కావడం ఈ రాకెట్‌పై ఇతర దేశాలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి పీఎస్‌ఎల్వీ సత్తాను ప్రపంచానికి నిలువెత్తు చాటింది. అలాగే చంద్రయాన్‌-1, మంగళయాన్‌, ఆస్ట్రోశాట్‌ వంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాలకు ఈ రాకెట్‌ను వినియోగించి విజయవంతం చేయడం విశేషం.  ఈ రాకెట్‌ తయారీకి రూ.130 కోట్లు ఖర్చు అవుతున్నా ఈ రాకెట్‌తో ప్రవేశపెట్టే విదేశీ ఉపగ్రహాల వల్ల అంతకు ఎన్నో రేట్ల ఆదాయాన్ని దేశానికి ఈ రాకెట్‌ సమకూరుస్తోంది. 


అదిగదిగో రాకెట్‌ 

అదిగదిగో రాకెట్‌... దూసుకుపోతోంది చూడు చూడు... అంటూ సందర్శకులు రోదసిలోకి దూసుకుపోతున్న పీఎస్‌ఎల్వీ-సీ50ను చూసి కేరింతలు కొట్టారు. ఈ రాకెట్‌ ప్రయోగానికి షార్‌ లోపలకు ఇస్రో సందర్శకులకు అనుమతించకపోయినా పలువురు అటకానితిప్ప వద్దకు చేరుకొని పులికాట్‌ తీరం నుంచి రాకెట్‌ ప్రయోగాన్ని తిలకించారు. పలువురు తమ సెల్‌ఫోన్లలో రాకెట్‌ పయనాన్ని బంధించారు. 


శాస్త్రవేత్తలకు అభినందనలు 

పీఎస్‌ఎల్వీ-సీ50 విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో చైర్మన్‌ శివన్‌తోపాటు శాస్త్రవేత్తలకు శ్రీసిటీ అధినేత రవీంద్ర సన్నారెడ్డి, ఇస్రో విశ్రాంత ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.  





Updated Date - 2020-12-18T04:29:33+05:30 IST