అంతర్వేది’లో అరెస్ట్‌ చేసిన వారిని..తక్షణం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-09-12T10:56:01+05:30 IST

అంతర్వేది అంశంలో అరెస్ట్‌ చేసిన బీజేపీ, వీహెచ్‌పీ, జనసేన కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌

అంతర్వేది’లో అరెస్ట్‌ చేసిన వారిని..తక్షణం విడుదల చేయాలి

కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ, జనసేన, వీహెచ్‌పీ ధర్నా

తహసీల్దారు కార్యాలయాల వద్దా నిరసన


నెల్లూరు(హరనాథపురం), సెప్టెంబరు 11 : అంతర్వేది అంశంలో అరెస్ట్‌ చేసిన బీజేపీ, వీహెచ్‌పీ, జనసేన కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయా పార్టీలు, సంస్థల నాయకులు శుక్రవారం నెల్లూరులో కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. జిల్లాలోని పలు తహసీల్దారు కార్యాలయాల వద్ద కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఆందోళనలో బీజేపీ నెల్లూరు పార్లమెంటు స్థానం అధ్యక్షుడు భరత్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని ప్రభుత్వ సీరియస్‌గా తీసుకోవటం లేదని ఆరోపించారు.


ఆ ఘటనపై ఉద్యమించిన హిందువులపై అక్రమ కేసులు బనాయించటం సరికాదన్నారు. జనసేన పార్టీ నాయకుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్వేది ఘటనకు బాధ్యత వహించి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కొండ బిట్రగుంటలోని వెంకటేశ్వరస్వామి రథం దగ్ధం, తిరుమల పింక్‌ డైమండ్‌, సింహాచలం ఆలయ వివాదాలను కూడా సీబీఐ పరిధిలోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి,  జిల్లా మాజీ అధ్యక్షుడు సరేంద్రరెడ్డి,  ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు బయ్యా శ్రీనివాసులు, వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి మిద్దె శ్రీనివాసులు, భజరంగ్‌దళ్‌ సంయోజకుడు విశ్వనాథ్‌, జనసేన నాయకుడు పావుజెన్ని చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-12T10:56:01+05:30 IST