-
-
Home » Andhra Pradesh » Nellore » postmartum
-
మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం
ABN , First Publish Date - 2020-12-07T04:26:09+05:30 IST
మూడు రోజుల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని పోలీసులు ఆదివారం వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు.

కుమార్తెను అల్లుడు హత్యచేశాడనే ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
సూళ్లూరుపేట, డిసెంబరు 6 : మూడు రోజుల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని పోలీసులు ఆదివారం వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. తన కుమార్తెను అల్లుడు హత్య చేశాడని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మన్నారుపోలూరు చిన్నగిరిజనపాళేనికి చెందిన అంబూరు సురేష్, సుభాషిణి, భార్యాభర్తలు. వారికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. ఈనెల 2వ తేదీ రాత్రి సురేష్ మరో యువతితో ఉండగా సుభాషిణి చూసి నిలదీసింది. దాంతో అతను ఆమెపై దాడిచేసి బలవంతంగా ఆమె నోట్లో పురుగులమందుపోశాడు. దాంతో ఆమె కేకలు వేస్తూ సమీపంలోని తన తల్లిదండ్రుల ఇంటి వద్దకు పరుగులు తీసి జరిగిన విషయం వారితో చెప్పింది. ఆమెను హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గూడూరుకు తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. గిరిజనపాళెం పెద్దలు ఈ విషయాన్ని బయటకు రానీవ్వకుండా ఇరువర్గాలతో మాట్లాడి రాజీ కుదిర్చారు. సురేష్ తన పేరుపై ఉన్న అర ఎకర పొలాన్ని పాపపేరుమీద రాయాలని, అతను మున్సిపాలిటీలో పనిచేస్తున్నందున నెలనెలా సగం జీతం కుతూరికి ఇవ్వాలని పెద్దలు నిర్ణయించారు. దాంతో గుట్టుచప్పుడు మృతదేహాన్ని ఈనెల 3న ఖననం చేశారు. అయితే సురేష్ పెద్దల నిర్ణయాన్ని అంగీకరించనని చెప్పడంతో మృతురాలి తండ్రి శనివారం రాత్రి తన కుమార్తెను అల్లుడు హత్య చేశాడని సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించి తహసీల్దారు సమక్షంలో పోస్టుమార్టం చేయించారు. నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.