ఆగిన ‘బాలామృతం’

ABN , First Publish Date - 2020-02-12T09:18:47+05:30 IST

నిరుపేద బాలబాలికలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నియంత్రణ, పౌష్టికాహరా న్ని అందచేయాలనే ఆశయంలో నెలకొల్పిన

ఆగిన ‘బాలామృతం’

నిలిచిపోయిన పాల సరఫరా

అంగన్‌వాడీ కేంద్రాల తీరు అస్తవ్యస్తం


ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 11 :  నిరుపేద బాలబాలికలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నియంత్రణ, పౌష్టికాహరాన్ని అందచేయాలనే ఆశయంలో నెలకొల్పిన అంగన్‌వాడీ కేంద్రాలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ఈ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు అందజేసేందుకు పాలు లేవు. పసిపిల్లలకు పంపిణీ చేసే బాలామృతం పౌష్టికాహార ప్యాకెట్లు అందడంలేదు. వీటి సరఫరా లేకపోవడంతో కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి పాలు, బాలామృతం సరఫరా నిలిచిపోయింది. ఎప్పుడు సరఫరా చేస్తారోనన్నదానిపై స్పష్టత లేదు. ఇక బాలసంజీవని పథకం పూర్తిగా రద్దయ్యింది. 


పౌష్టికాహారం ఇలా..

జిల్లాలోని 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,774 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సుమారు 1.54 లక్షల మంది చిన్నారులు, 19,611 మంది గర్భిణులు, 17,457 మంది బాలింతలు ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 ఎంఎల్‌ పాలు ఇస్తారు. బాలామృతం ప్యాకెట్ల ద్వారా మూడేళ్లలోపు పిల్లలకు నెలకు 2.5 కేజీ కలిగిన పౌష్టికాహారం అందజేస్తారు. కానీ డిసెంబరు  నుంచి పాలు, బాలామృతం ప్యాకెట్లను ప్రభుత్వం సరఫరా చేయలేదు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ లేకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు కార్యకర్తలతో వివాదానికి దిగుతున్నారు. 


అస్తవ్యస్తంగా నిర్వహణ

మరోవైపు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రాజెక్టుల పరిధిలో తగినంతమంది పర్యవేక్షకులు లేకపోవడంతో కేంద్రాల నిర్వహణ సరిగా లేదు. ఉదయగిరి ప్రాజెక్టు పరిధిలో పది మంది సూపర్‌వైజర్లకు ఒక్కరే ఉన్నారు. ఇక ఆత్మకూరు, వింజమూరు ప్రాజెక్టుల పరిధిలో సైతం అంతే. ఓవైపు పౌష్టికాహారం పంపిణీ లేకపోవడం, పర్యవేక్షణ కొరవడడంతో కేంద్రాలు నిర్వహణను పట్టించుకొనే వారే కరువయ్యారు. 


బాలామృతం ఇవ్వడంలేదు..

నాకు చిన్నబిడ్డ ఉంది. రెండు నెలలుగా బాలామృతం ఇవ్వడంలేదు. అంగన్‌వాడీ కేంద్రంలో అడిగితే వస్తాయంటున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియదు. 

- సావిత్రి, బాలింత

 

రెండు నెలలుగా పాలు లేవు..

అంగన్‌వాడీ కేంద్రంలో రెండు నెలలుగా పాలు ఇవ్వడంలేదు. ప్రతిరోజూ కేంద్రంలో పౌష్టికాహారం తింటున్నాం. పాలు ఎప్పుడు వస్తాయని అధికారులను అడిగితే ఇదిగో వస్తున్నాయంటున్నారే తప్ప రావడంలేదు. 

- భాగ్యలక్ష్మి, గర్భిణి


ఉన్నతాధికారులకు నివేదించాం..

అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు, బాలామృతం సరఫరాలో జాప్యం జరుగుతోంది. ఈ విషయం ఉన్నతాధికారులకు కూడా తెలియయచేశాం. కాంట్రాక్టు ముగియడంతోనే సరపరాలో జాప్యం ఏర్పడింది. త్వరలో కేంద్రాలకు సరఫరా అవుతాయని వారు చెప్పారు.

- ఈస్టర్‌రాణి, సీడీపీవో, ఉదయగిరి

Updated Date - 2020-02-12T09:18:47+05:30 IST