కాలుష్యం... కబళిస్తోంది !

ABN , First Publish Date - 2020-12-02T04:31:36+05:30 IST

మానవులు చేస్తున్న కొన్ని తప్పిదాల వల్ల వాతావరణ కాలుష్యం తీవ్రమై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఇది జీవుల మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోంది.

కాలుష్యం... కబళిస్తోంది !

తీవ్రమవుతున్న పరిశ్రమలు, వాహన కాలుష్యం 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ప్రమాదకర రసాయానాలతో జీవ జాలం అస్తవ్యస్థం

మేలుకోకపోతే భవిష్యత్‌ అంధకారమే

నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం


నెల్లూరు(వైద్యం), డిసెంబరు 1 : మానవులు చేస్తున్న కొన్ని తప్పిదాల వల్ల వాతావరణ కాలుష్యం తీవ్రమై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఇది జీవుల మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోంది. నీరు, గాలి, భూమి కలుషితం కావడం ప్రజారోగ్యంతోపాటు పశుపక్ష్యాదులపై, పంటలపైౖ పెను ప్రభావం చూపుతోంది. పరిశ్రమల నుంచి వెలువడే సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటి విష వాయువులు అనారోగ్య హేతువులవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏటా డిసెంబరు 2వతేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. 

జిల్లాలో పరిస్థితి మరీ దారుణం

జిల్లా విషయానికి వస్తే కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత ఆ స్థాయి పరిశ్రమలు నెల్లూరుకు తరలి వస్తున్నాయి. సముద్ర తీరంలో కేవలం 13 కిలోమీటర్ల పరిధిలోనే 27 థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమలు నిర్మిస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే ఉత్పత్తినందిస్తున్నాయి. ఆ పరిశ్రమల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి పంటల దిగుబడి 30 శాతం తగ్గుతున్నట్లు నిపుణులు అంటున్నారు. ఆక్వా పరిశ్రమ అయితే కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. థర్మల్‌ కేంద్రాల వేడి వల్ల సముద్రంలోని వేల టన్నుల రొయ్యలు, చేపలు మృతి చెంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో 43 డిగ్రీల ఎండకే అల్లాడిపోయిన జిల్లా ప్రజలు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  దీనికితోడు ఫ్రిజ్‌లు, ఏసీల వాడకం పెరగడంతో క్లోరోఫ్లోరో కార్బన్‌లు వెలువడి ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచి కరోనా కారణంగా పరిశ్రమలు మూతపడటం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాహన రద్దీ తగ్గడంతో వాయు కాలుష్యం కొంత వరకు తగ్గిందని, కానీ భవిష్యత్తులో మాత్రం జిల్లాపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.  

మొక్కలతోనే రక్షణ

మనం పెంచే ఒక చెట్టు వంద మందికి ఆక్సిజన్‌ను అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రతి పరిశ్రమకు కేటాయించే 100 ఎకరాల్లో 30 ఎకరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలి. అయితే ఈ గ్రీన్‌బెల్ట్‌ నిబంధనను ఏ పరిశ్రమా అమలు చేస్తున్న దాఖలాల్లేవు. దీనికితోడు రహదారుల విస్తరణలో చెట్లను నరికివేయడం, మరలా ఆ రహదారి వెంట మొక్కలు నాటకపోవడంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు వారి ఇంటి ముందు కనీసం ఒక మొక్క అయినా నాటి సంరక్షించాలని, అవే మనల్ని కాపాడుతాయని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. అలాగే ప్లాస్టిక్‌, రసాయనాల వాడకం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిస్తున్నారు.


కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చొరవ 

- ప్రమోద్‌కుమార్‌ రెడ్డి, కాలుష్య నియంత్రణశాఖ ఈఈ

జిల్లాలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గతంలో 60 శాతంపైగా ఉండే కాలుష్యం ప్రస్తుతం 50 శాతంలోపు నమోదవుతోంది. ముత్తుకూరు పరిధిలో కొన్ని పరిశ్రమలు మూతపడటంతో కొంత వరకు కాలుష్యం తగ్గింది. పరిశ్రమల్లో గ్రీన్‌బెల్ట్‌ నిబంధన అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం.

Updated Date - 2020-12-02T04:31:36+05:30 IST