ఉగ్ర పెన్నా..!

ABN , First Publish Date - 2020-11-28T05:21:03+05:30 IST

ఉగ్ర పెన్నా..!

ఉగ్ర పెన్నా..!
సంగం: ఆనకట్ట వద్ద పెన్నమ్మ పరవళ్లు

జిల్లాను వణికించేసిన ‘నివర్‌’

సోమశిలకు పోటెత్తుతున్న వరద

ఉపనదుల కలయికతో పెరిగిన ఉధృతి

రాత్రికి మరింత పెరిగే అవకాశం

పరివాహక గ్రామాలన్నీ మునక

పునరావాస కేంద్రాలకు బాధితులు

తుఫాన్‌ దాటికి విరగిన స్తంభాలు, వృక్షాలు

కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం

స్తంభించిన రవాణా వ్యవస్థ

కోల్‌కతా హైవేపై 18 గంటలపాటు ప్రయాణికుల పాట్లు 


అనుకున్నట్టే జరిగింది. నివర్‌.. సింహపురిని వణికించేసింది. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు, కుండపోత వర్షం ప్రజలను భయకంపితులను చేసింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోగా, జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు ఇంకా తేరుకోలేదు. ఇది చాలదన్నట్టు  సోమశిల జలాశయానికి పోటెత్తుతున్న వరదతో పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చింది. మహోగ్రంగా ప్రవహిస్తూ తన తీర ప్రాంతాలను ముంచెత్తుతోంది. జలాశయానికి అంతకంతకూ పెరుగుతున్న ఇన్‌ఫ్లోను చూసి అధికారుల్లోనూ వణుకు మొదలైంది. వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు వదులుతుండటంతో గ్రామాలను వరద దిగ్బంధించేస్తోంది. ఇక నెల్లూరు  నగరంలో మునక ప్రాంతాలన్నీ పెన్నా నీటితో నిండిపోయాయి. పారాహుషార్‌.. అంటూ పోలీసులు, అటు అధికారులు పెన్నా పరీవాహక ప్రాంతవాసులను హెచ్చరిస్తున్నారు.


నెల్లూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నివర్‌.. జిల్లాలో భయానక పరిస్థితులు సృష్టించింది. జిల్లావ్యాప్తంగా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.  సోమశిలలోకి పోటెత్తి వస్తున్న వరద ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. మహోగ్రంగా ప్రవహిస్తూ పరివాహిక ప్రాంతాలను ముంచెత్తింది. శుక్రవారం సోమశిల నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు పెన్నాలో కలవడంతో పాటు ఉపనదులు ఉప్పొంగడంతో నది ఉగ్రరూపం దాల్చింది. నెల్లూరులోని రంగనాయక స్వామి పాదాలు కడిగేంత ఉత్సాహంతో పరవళ్లు తొక్కుంది. సోమశిల కరకట్టలు, పెన్నా పరివాహక కరకట్టలు తెగిపోయే ప్రమాదం నెలకొంది. లోతట్టు ప్రాంతంలో వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద నీటి తాకిడికి పలు రోడ్లు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై ఉన్న వంతెనలు దెబ్బతినడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద సర్వీసు రోడ్డు నీట మునగడంతో చెన్నై-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో సుమారు 18 గంటలపాటు ప్రయాణికులు అవస్థలు పడ్డారు.


ఇక రెండు రోజులూ కష్టమే..

శని, ఆదివారాల పరిస్థితి తలుచుకుంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి సోమశిల ఇన్‌ ఫ్లో 3లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే సోమశిల నుంచి పెన్నాకు చేరే వరద నీరు మరింత ఎక్కువతుంది. మరిన్ని ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే పెన్నా వంతెన వద్ద కరకట్ట కోతకు గురయ్యింది. పెన్నాలో నీటి మట్టం మరింత పెరిగితే ఇది తెగిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికే పలు చోట్ల కరకట్లకు గండ్లు పడ్డాయి. నీటి ఉధృతి పెరిగితే ఈ కరకట్టలు తెగి ఊళ్లమీదకు వరద నీరు చేరే ప్రమాదం ఉంది.  ఈ విషయాన్ని ముందే గ్రహించిన అధికారులు లోతట్టువాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నెల్లూరులో పెన్నా ప్రవాహాన్ని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.

Read more