అశ్రద్ధనా.. అవగాహన లేకనా?!
ABN , First Publish Date - 2020-12-11T05:34:14+05:30 IST
నెల్లూరు కాలువలో వరద ప్రవాహం తగ్గడం లేదు. పొట్టేపాళెం వద్ద కలుజు ఉధృతి కూడా తగ్గడం లేదు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణికులకు కష్టాలు సైతం తొలగడం లేదు. దీనంతటికీ కారణం ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు.
నెల్లూరు కాలువకు తగ్గని వరద
రెగ్యులేటరున్నా వాడని అధికారులు
పొట్టేపాళెం వద్ద అదే ఉధృతి
ప్రయాణికులకు తప్పని తిప్పలు
జలవనరుల శాఖపై విమర్శల వెల్లువ
నెల్లూరు రూరల్, డిసెంబరు 10 : నెల్లూరు కాలువలో వరద ప్రవాహం తగ్గడం లేదు. పొట్టేపాళెం వద్ద కలుజు ఉధృతి కూడా తగ్గడం లేదు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణికులకు కష్టాలు సైతం తొలగడం లేదు. దీనంతటికీ కారణం ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు.
సంగం ఆనకట్ట నుంచి మొదలయ్యే నెల్లూరు కాలువ (ఎన్‌టీఎస్) పెన్నా నది నీటిని నెల్లూరులోని స్వర్ణాల చెరువుకు చేరుస్తుంది. ఇటీవల సంభవించిన తుపాన్లు, భారీ వర్షాలు వరదల కారణంగా ఈ కాలువ గుండా పెద్ద స్థాయిలో వరద నీరు నెల్లూరు చెరువుకు చేరింది. అప్పటికే నిండుకుండలా ఉన్న ఆ చెరువు ఈ వరదతో ప్రమాదకరంగా మారింది. నిల్వ సామర్థ్యానికి మించి నీటిని ఎన్‌టీఎస్ ద్వారా విడుదల చేయడంతో చెరువు పొంగి ఆ ప్రవాహం ప్రతిరోజూ పొట్టేపాళెం వద్ద కలుజు ద్వారా మళ్లీ పెన్నా నదిలోకి చేరుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా పొట్టేపాళెం కలుజు వద్ద జొన్నవాడ రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ఇదిలా ఉండగా ఎన్‌టీఎస్‌కు జొన్నవాడ మలుపు వద్ద ప్రవాహాన్ని ఆపే రెగ్యులేటర్ ఉంది. దీని ద్వారా కాలువలోని వరదను అక్కడి నుంచే పెన్నాలోకి మళ్లించవచ్చు. ఇలా చేస్తే జొన్నవాడ రోడ్డుపై వరదను తగ్గించి రాకపోకలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టవచ్చు. కానీ అధికారులు ఆ రెగ్యులేటర్‌ను ఉపయోగించకపోతుండటంతో వరద అధికమై చెరువు పొంగుతోంది. ప్రస్తుతం జొన్నవాడ నుంచి నెల్లూరు చెరువు వరకు ఆయకట్టు భూములకు సాగునీరు పుష్కలంగా ఉన్నందున రెగ్యులేటర్ చెక్కలు కిందకు దించేసినా రైతులకు ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారో, లేక నూతన సిబ్బందికి అవగాహన లేకనో నీటి విడుదలను నియంత్రించలేకపోతున్నారు. ఫలితంగా భారీ స్థాయిలో పెన్నా నీరు మళ్లీ పెన్నాలోకే చేరుతోంది. ఈ విషయంలో జలవనరుల శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి పొట్టేపాళెం వద్ద వరద ప్రవాహాన్ని తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
