-
-
Home » Andhra Pradesh » Nellore » Option with verification name
-
‘వెయ్యి’ ఇక్కట్లు !
ABN , First Publish Date - 2020-04-07T10:46:47+05:30 IST
అసలే కష్టకాలం.. ఆపై కూలి పనులు చేసుకునే పరిస్థితి కూడా లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు, పూట గడపడానికి నానా అగచాట్లు పడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో

రేషన్‌కార్డు ఉన్నా అందని ఆర్థిక సాయం
వెరిఫికేషన్ పేరుతో నిలిపివేత
సరుకులిచ్చారు కదా.. నగదు ఎందుకివ్వరు ?
బాధితుల గగ్గోలు
ప్రభుత్వం దృష్టికి సమస్య : డీఎస్వో
నెల్లూరు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : అసలే కష్టకాలం.. ఆపై కూలి పనులు చేసుకునే పరిస్థితి కూడా లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు, పూట గడపడానికి నానా అగచాట్లు పడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిబంధనల పేరుతో వారికి అన్యాయం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అందని నగదు
రాష్ట్రంలో రేషన్‌కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి లాక్‌డౌన్ సమయంలో ఉచితంగా రేషన్ బియ్యం, కందిపప్పుతోపాటు రూ.వెయ్యి ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 29వతేదీ నుంచి రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కార్డు ఎవరికైతే ఉందో వారందరికీ సరుకులు అందిస్తున్నారు. అలాగే ఈ నెల 4వ తేదీ నుంచి పేదలకు రూ.వెయ్యి ఆర్థిక సాయం వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కానీ అర్హులైన కొందరికి ఈ ఆర్థిక సాయం అందలేదు. దీనిపై స్థానికంగా పేదలు వలంటీర్లను ప్రశ్నిస్తే తమకు వచ్చిన పేర్లకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని వారు సమాధానమిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు కదలలేని సమయంలో ఈ విషయాన్ని పైఅధికారులకు చెప్పుకునే అవకాశం కూడా అర్హులకు లేకుండా పోయింది.
కార్డుల తొలగింపు
జిల్లాలో సుమారు 9 లక్షలకు పైగా రేషన్‌కార్డులున్నాయి. వీటన్నింటికీ రేషన్ సరుకులు అందిస్తున్నారు. ఇక గతేడాది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అనర్హులైన వారికి రేషన్‌కార్డులను తొలగించడం మొదలుపెట్టింది. 300 యూనిట్ల కన్నా ఎక్కువగా విద్యుత్ వినియోగించేవారు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు, 3 ఎకరాల మాగాణి లేక 10 ఎకరాల మెట్ట భూమి కన్నా ఎక్కువగా ఉండడం వంటి పలు నిబంధనలను పెట్టి ఆ ప్రకారం అనర్హులను గుర్తించింది. అర్హులైన రేషన్‌కార్డుల స్థానంలో బియ్యం కార్డులు పంపిణీ చేసింది. ఈ కార్డు ఉన్నవారికే ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో సుమారు లక్ష వరకు రేషన్ కార్డులు అనర్హుత జాబితాలో చేరాయి. వీరికి బియ్యం కార్డులు ఇవ్వలేదు. అనర్హులుగా పేర్నొన్న వాటిలో అర్హులైన వారి కార్డులు కూడా ఉన్నాయని, సాంకేతిక తప్పిదాలతో ఈ కార్డులు అనర్హుల జాబితాలో చేరాయన్న ఫిర్యాదులు అప్పటి నుంచి వెల్లువెత్తుతున్నాయి.
వెరిఫికేషన్ పేరుతో..
ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్నప్పటికీ అనర్హత జాబితాలో చేరిన కుటుంబాలు ఆధారాలతో ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. దీంతో వేల సంఖ్యలోనే అర్హులు వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ రీవెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు. కరోనా నియంత్రణ చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమవడంతో రేషన్ కార్డుల అంశాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో ఉన్న రేషన్‌కార్డుల కుటుంబాలన్నింటికీ ఆర్థిక సాయం అందలేదు. తాము అర్హులమని ఆధారాలతో సహా సమర్పించినప్పటికీ ఎందుకు రూ.వెయ్యి ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. పలు గ్రామాల్లో వలంటీర్లతో వివాదాలు కూడా జరుగుతున్నాయి. పేదలమైన తమకు ఆ రూ.వెయ్యి ఇస్తే నిత్యావసర సరుకులు కొనుక్కొని ఎలాగోలా లాక్‌డౌన్ సమయంలో పొట్టనింపుకుంటామని వారంటున్నారు.
ప్రభుత్వం దృష్టికి సమస్య
ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి బాలకృష్ణారావును వివరణ కోరగా అనర్హత జాబితాలో ఉన్న కార్డుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. అక్కడి నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని చెప్పారు.