మధ్యాహ్నం వరకు రోడ్లపైనే..

ABN , First Publish Date - 2020-03-30T09:49:55+05:30 IST

గడిచిన వారం రోజులుగా కొంత నియంత్రణను పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన జనం ఆదివారం మాత్రం మధ్యాహ్నం వరకు రోడ్లపై తిరిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా

మధ్యాహ్నం వరకు రోడ్లపైనే..

చికెన్‌, మటన్‌ దుకాణాల ముందు క్యూ

పోలీసులు అడ్డుకుంటున్నా రకరకాల కారణాలతో తిరిగిన జనం

కరోనా తీవ్రతను విస్మరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు

మరోవైపు రేషన్‌ దుకాణాల వద్ద బారులు తీరిన జనం


నెల్లూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : గడిచిన వారం రోజులుగా కొంత నియంత్రణను పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన జనం ఆదివారం మాత్రం మధ్యాహ్నం వరకు రోడ్లపై తిరిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా రకరకాల కారణాలతో బయటకు వచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. ఇందుకు ఒకటి ఆదివారం కావడం, రెండోది రేషన్‌ సరుకులు పంపిణీ చేయడమే. ఆదివారం కావడంతో ఎక్కువ మంది నాన్‌ వెజ్‌ కోసం బయటకు వచ్చారు. చికెన్‌, మటన్‌ దుకాణాల ముందు బారులు తీరారు.


ప్రతి దుకాణం ముందు సామాజిక దూరం పాటిస్తూ ముగ్గుతో గడులు ఏర్పాటు చేశారు. వాటిలో నిల్చొని వచ్చేలా చేశారు. కానీ ఇవి సరిపోక రోడ్లపై కూడా క్యూ కట్టారు. ఇక్కడ కొంత ఇబ్బంది కలిగింది. మధ్యాహ్నం వరకు ఈ పరిస్థితి కనిపించింది. దీంతో వాహన రాకపోకలు కూడా ఎక్కువయ్యాయి. నెల్లూరు నగరంలో ఉదయం నుంచే పోలీసులు రోడ్లపైకి చేరి వాహనాలను అడ్డుకున్నారు.  కొన్ని చోట్ల కూరగాయలు సరిపోలేదు. ఒంటి గంట తర్వాత దుకాణాలను మూసివేయడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించారు.


రోడ్లపైకి వస్తున్న వారిని ఆపి వివరాలు తెలుసుకున్నారు. అత్యవసరమైతే తప్ప మిగిలిన వారిని తిప్పి పంపారు. ఇక కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు తన క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. కాగా ఆదివారం మధ్యాహ్నం వరకు పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి రావడం ఆందోళన కలిగింది. కరోనా వ్యాప్తి కీలక దశలో ఉన్న సమయంలో ఇలా ఎక్కువ సంఖ్యలో రోడ్లపైన తిరిగితే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


గూడూరులో లాక్‌డౌన్‌ అమలు పటిష్టంగా జరిగింది. పోలీసుల పకడ్బందీగా 144 సెక్షన్‌ అమలు పరచడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటగిరిలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు దుకాణాలను నిర్వహించారు. 


నాయుడుపేట డివిజన్‌లో ఆదివారం ప్రధాన రహదారులే కాకుండా దాదాపు అన్ని వీధుల్లో రాకపోకలకు వీలులేకుండా ముళ్లకంపలు, బైక్‌లు, తోపుడుబండ్లు అడ్డంగా పెట్టారు. సూళ్లూరుపేటలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. పెళ్లకూరు, ఓజిలి, దొరవారిసత్రం, తడ మండల కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు నిత్యావసరాల కోసం జనం బయటకు వచ్చారు. 


కావలి పట్టణం, కావలిరూరల్‌, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, కొండాపురం మండలాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఎక్కడ ఇబ్బందులు కలగలేదు. ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో నిత్యావసరాల కోసం ఉదయం జనాలు ఎక్కువగా బయటకు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత దుకాణాలు మూసివేశారు. 

Updated Date - 2020-03-30T09:49:55+05:30 IST