‘ఉపాధి’ నిధుల స్వాహా!
ABN , First Publish Date - 2020-12-30T03:48:46+05:30 IST
ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్లో సిబ్బంది తమ చేతివాటం చూపి పలు అవకతవకలకు పాల్పడగా సామాజిక తనిఖీలో బహిర్గతమైంది.
సామాజిక తనిఖీలో బహిర్గతం
రూ.2.71 లక్షల రికవరీకి ఆదేశం
ఉదయగిరి, డిసెంబరు 29: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్లో సిబ్బంది తమ చేతివాటం చూపి పలు అవకతవకలకు పాల్పడగా సామాజిక తనిఖీలో బహిర్గతమైంది. దీంతో పలుశాఖల సిబ్బంది నుంచి రూ.2,71,070 రికవరీకి ఆధికారులు ఆదేశించారు. మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీల్లో 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఉపాధి హామీ పథకం కింద 1,453 పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి వేతనాలకు రూ.5,30,03,670, మెటీరియల్‌కు రూ.1,28,28,131తో మొత్తం రూ.6,58,31,801 ఖర్చు చేశారు. ఈ పనులకు సంబంధించి ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీలు, తనిఖీ సిబ్బంది సామాజిక తనిఖీ నిర్వహించి గ్రామాల్లో గ్రామ సభల ద్వారా విచారించారు. పనులకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, పనికి వేతనం లెక్కించడంలో తేడాలు తదితర సమస్యలు గుర్తించారు. వీటిపై మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సతీ్‌షబాబు ఆధ్వర్యంలో 13వ విడత సామాజిక తనిఖీ బహిరంగ వేదిక నిర్వహించారు. నిధుల వినియోగంపై సంబంధిత అధికారులను విచారించారు. ఉదయగిరి గ్రామ పంచాయతీలో రూ.36,14,896 లక్షలకు సంబంధించి 11 పనులకు రీ ఎంక్వైరీకి ఆదేశించారు. సుమారు రూ.2.71 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన అధికారులు ఆ నిధుల రికవరీకి ఆదేశించారు. అందులో ఉపాధి హామీ పఽథకంలో రూ.1,80,849, డీఆర్‌డీఏ పరిధిలో రూ.82,568, అటవీశాఖ పరిధిలో రూ.5,253, హౌసింగ్ పరిధిలో రూ.2,400 రికవరీ చేయాలన్నారు. గతంలో బహిరంగ విచారణకు గ్రామాల నుంచి ఉపాధి కూలీలు, ప్రజలు భారీ సంఖ్యలో వస్తుండగా ఈ దఫా ప్రజలే కనిపించలేదు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు వెంకటేశ్వరరావు, విజయకుమార్, ఎంపీడీవో వీరాస్వామి, ఎస్‌ఆర్‌పీలు రవి, మల్లికార్జున, ఫడ్స్ డైరెక్టర్ రమణయ్య, ఏపీవో వెంకటరమణ, ఈసీ శ్రీనివాసులు, టీఏలు, క్షేత్రసహాయకులు తదితరులు పాల్గొన్నారు.