అందరికీ కాదు.. కొందరికే!
ABN , First Publish Date - 2020-04-25T09:42:23+05:30 IST
పేదలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు కొందరికే దక్కనున్నాయి.

రేషన్‌కార్డుల కోసం 20 వేల దరఖాస్తులు
కుటుంబ కార్డుల్లో పేర్లు రద్దు చేసుకుంటేనే కొత్తవి
అందిన కొత్త దరఖాస్తులు 5,199
పరిశీలించినవి 2,270
3000 కార్డులు వచ్చే అవకాశం
మరో వారంలో పంపిణీ సన్నద్దం
నెల్లూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పేదలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు కొందరికే దక్కనున్నాయి. నవశకం కార్యక్రమంలో జిల్లా నుంచి సుమారు 20వేల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా, ప్రస్తుతం వారిలో మూడు వేల మందికి మాత్రమే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి చేతికందడానికి మరో వారం పట్టనుంది.
పరిశీలన పూర్తి
కొత్త కార్డుల కోసం 5,199 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో బుధవారం సాయంత్రానికి 2,270 దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. పరిశీలనలో ఇప్పటి వరకు కార్డులేని వారిని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. ఇదివరకే ఇంకో కార్డులో పేరు ఉంటే అలాంటి వారి దరఖాస్తులు పక్కన పెట్టేశారు. తొలుత వీరు పాత కార్డులో పేరు రద్దు చేసుకున్న తరువాతే కొత్త కార్డు ఇస్తామంటున్నారు. ఈ కారణంగా జిల్లాలో వేలాది మందికి కొత్త కార్డుల ఆశలు ఆవిరయ్యాయి. వాస్తవానికి నవశకం సందర్భంగా వీరంతా తల్లిదండ్రుల కార్డుల్లో నుంచి తమ పేర్లు తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ ప్రక్రియను పక్కన పెట్టేశారు.
ఆ ఎన్నికలు ఆగిన వెంటనే కరోనా వచ్చింది. అధికారులు, సిబ్బంది పూర్తిగా కరోనా నియంత్రణ పనుల్లో మునిగిపోయారు. యుద్ధ ప్రాతిపదికన ఐదు రోజుల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయమని ముఖ్యమంత్రి ఆదేశించడంతో మళ్లీ ఈ పని మీద దృష్టి సారించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అందిన అన్ని దరఖాస్తులను పరిశీలించి ఐదు రోజుల్లో కొత్త కార్డులు ఇవ్వడం సాధ్యం కాదనే ఉద్దేశంతో కేవలం ఇప్పటి వరకు కార్డు లేని వారి దరఖాస్తులకు మాత్రమే పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 5199 దరఖాస్తుల్లో 2270 దరఖాస్తులను ఓకే చేసి వీరికి కొత్త కార్డులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనకు ఇంకా రెండు మూడు రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నింటికి పరిశీలించినా కొత్త రేషన్ కార్డులు 3వేలకు మించవని అధికారులు అంటున్నారు.
అర్హులందరికీ ఇప్పట్లో లేనట్లే..!?
కుటుంబాల నుంచి విడిపడిన వారు, ఇప్పటి వరకు రేషన్ కార్డే లేనివారు చాలా మందికి ఇప్పట్లో కొత్త కార్డులు అందే అవకాశం లేదు. కుటుంబాల నుంచి విడిపడిన వారు పాత కార్డుల్లో తమ పేర్లు తొలగించాలని కోరినా ఎన్నికలు, ఆ తరువాత కరోనా నేపథ్యంలో ఆ పనులు జరగలేదు. దీనికి తోడు ఇప్పటి వరకు కార్డే లేనివారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా ప్రస్తుత పరిస్థితులు సహకరించడం లేదు. ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న పేదలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. ఈ రెండు కేటగిరిల్లో అర్హులందరికి కొత్త కార్డులు అందాలంటే ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తే కాని సాధ్యపడదు. అయితే ఇప్పుడు ఆ పనిచేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ క్రమంలో చాలా మంది అర్హులకు ఇప్పట్లో కొత్త కార్డులు అందే సూచనలు కనిపించడం లేదు.