రెండో పంటకు నీరిస్తారా?

ABN , First Publish Date - 2020-03-24T07:18:00+05:30 IST

సోమశిల జలాశయం పరిధిలోని ఉత్తర కాలువకు ఈసారైనా రెండో పంటకు నీరు ఇస్తారా అన్న సందేహాలు

రెండో పంటకు నీరిస్తారా?

ఉత్తర కాలువ రైతుల ఆశలు

యంత్రాంగం నుంచి స్పష్టత కరువు

పూర్తిస్థాయిలో కాని ఆధునికీకరణ పనులు


అనంతసాగరం, మార్చి 23: సోమశిల జలాశయం పరిధిలోని ఉత్తర కాలువకు ఈసారైనా రెండో పంటకు నీరు ఇస్తారా అన్న సందేహాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి యంత్రాంగం నుంచి స్పష్టత కరువైంది. సోమశిల జలాశయం మొదటి పంటకు ముందు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఈ క్రమంలో అధికారికంగా, అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల ఎకరాలకు పైగా వరి పంట సాగైంది. ప్రస్తుతం వరికోత పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు సోమశిల నుంచి నీరు ఇచ్చి నిలుపుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొదటిపంటకు నీటి ఇబ్బందులు లేకుండా పంట చేతికందింది. ఈ క్రమంలో రెండో పంటకు సంబంధించిన ఆంశంపై ఐఏబీ నిర్వహించి సోమశిల జలాశయంలో తాగునీరు, డెడ్‌ స్టోరేజి నీటిని మినహాయించి నీటి కేటాయింపులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారైనా రెండో పంట లో నాన్‌డెల్టా ఉత్తర కాలువకు నీరు ఇస్తారా, లేదా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.


 ఏటా అభివృద్ధి పనులు

 ఉత్తర కాలువ ప్రకాశం జిల్లా రాళ్లపాడు వరకు విస్తరించి ఉంది. ఈ కాలువ సామర్థ్యం తొలుత 380 క్యూసెక్కులు కాగా కాలువను ఆధునికీకరించి కాలువ సామర్థ్యం పెంచేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 2010 నుంచి కాలువ ఆధునికీ కరణ పనులు రెండో పంట సమయంలో చేపడుతున్నారు. కాలువలో నేడు 700 క్యూస్కెక్కుల వరకు నీటి ప్రవాహనికి అనుకూలత ఏర్పడింది. అయితే కాలువ పరిధిలో ఇంకా పుర్తిస్థాయిలో పనులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది నీరు ఇస్తారా, పనులు పూర్తి చేస్తారా అన్న అంశాలపై రైతుల్లో సందిగ్దం నెలకొంది. 


జలాశయంలో పుష్కలంగా నీరు

సోమశిల జలాశయంలో తాగునీటి అవసరాలను మినహాయించినా నీరు పుష్కలంగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో 47.464 టీఎంసీల నిల్వ ఉంది. ఈ క్రమంలో ఉత్తర కాలువ పరిధిలో రెండో పంటకు 3.5 టీఎంసీలు కేటాయించినా సుమారు 35 వేల ఎకరాలు సాగు చేసుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా నీరు ఇస్తే బాగుంటుందని రైతులు ఆశిస్తున్నారు.

Updated Date - 2020-03-24T07:18:00+05:30 IST