పనుల్లేవు..పైసల్లేవు!

ABN , First Publish Date - 2020-05-09T08:45:26+05:30 IST

పుష్కలంగా పంటలు పండే భూములు ఉన్నప్పటికీ వరుణుడు కరుణించకపోవడం, సాగునీరు లేక పోవడంతో ఉదయగిరి

పనుల్లేవు..పైసల్లేవు!

లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పస్తులు

వలస పక్షులు గూటికి చేరేనా..

సరిహద్దుల్లో జిల్లా వలస కూలీల పడిగాపులు

స్వగ్రామాలకు చేరుకునేందుకు అవస్థలు

రప్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి


ఉదయగిరి, మే 8: పుష్కలంగా పంటలు పండే భూములు ఉన్నప్పటికీ వరుణుడు కరుణించకపోవడం, సాగునీరు లేక పోవడంతో ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంత మెట్ట మండలాల నుంచి వేల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. పిల్లాపాపలతో అలా వలస వెళ్లిన వారు ఏడాదికోసారి స్వగ్రామాల్లో జరిగే వేడుకలకు వచ్చి నాలుగురోజులు గడిపి తిరిగి వెళుతుంటారు. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో వలస వెళ్లిన వారంతా ఎక్కడికక్కడే చిక్కు కుపోయారు. స్వగ్రామాలకు వచ్చేందుకు రాష్ట్రాలు, జిల్లా సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. వలస ప్రాంతాల్లో పనులు లేక.. చేతిలో పైసల్లేక అద్దెలు కట్టలేక పస్తులుంటు న్నారు. స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయడంలో జాప్యం జరుగుతుండడంతో ఎన్నిరోజులు ఇలా పస్తులుండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాలు, రాష్ట్రాలు దాటి..

జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంత మండలాల నుంచి ప్రజలు బతుకుదెరువు కోసం బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, మెదక్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌, కోరుట్ల, కర్నూలు, అనంతపురం, విజయవాడ, గుంటూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలకు వేల సంఖ్యలో వలస వెళ్లారు. అంతేకాక జిల్లాలోని నెల్లూరు, నాయుడుపేట, ఇతర మండలాలకు పనుల కోసం వెళ్లారు.


వివిధ రకాల పనులకు..

వలస వెళ్లిన వారు కొందరు వ్యాపారాలు, మరికొందరు రోజువారి కూలి పనులకు వెళుతూ కాలం వెల్లదీస్తుంటారు. బేల్దారీ, హోటళ్లు, పీజీ వసతి గృహాలు, సోడా వ్యాపారం, బొగ్గు కాల్చ డం, ఇటుక, కంకర కమీషన్‌ పద్దతి ద్వారా సరఫరా చేయడం తదితర పనులు చేస్తుంటారు. మరికొందరు ప్రైవేటు కంపెనీల్లో దినసరి కూలీలు, పారిశుధ్య కార్మికులుగా పనులకు వెళుతుంటారు. అయితే లాక్‌డౌన్‌తో పనులు ఆగిపోవడంతో 45 రోజులుగా వారు ఆయా ప్రాంతాల్లోనే ఉండిపోయారు. 


వలస కూలీల తరలింపులో జాప్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస వాసులు, కూలీలను స్వగ్రామాలకు చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో వలస కూలీల తరలింపులో జాప్యం జరుగుతోంది. దీనిపై జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో వలస వాసుల బంధుమిత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ పొడిగింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస వాసులను స్వగ్రామాలకు చేచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2020-05-09T08:45:26+05:30 IST