ఇసుక ఇక నేరుగా...!

ABN , First Publish Date - 2020-11-07T08:31:03+05:30 IST

ఇసుక కోసం అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఇసుక పాలసీలో మార్పులు చేసింది.

ఇసుక ఇక నేరుగా...!

 అన్‌లైన్‌ బుకింగ్‌ నుంచి సడలింపు

 రీచ్‌ నుంచే తెచ్చుకునే వెసులుబాటు 

 సొంత వాహనాలకూ అనుమతి

 రీచ్‌ల్లోనే తవ్వకాలు... పట్టాభూముల్లో నిషిద్ధం

 ఇసుక విధానంలో మార్పులు

 

నెల్లూరు(వెంకటేశ్వరపురం), నవంబరు 6 : ఇసుక కోసం అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఇసుక పాలసీలో మార్పులు చేసింది. అన్‌లైన్‌ విధానంలోనే ఇసుకను బుక్‌ చేసుకోవాలన్న నిబంధనను సడలించింది. ఇక నుంచి ప్రజలు నేరుగా రీచ్‌కు వెళ్లి నాణ్యమైన ఇసుకను కొనుగోలు చేసుకునేలా తీర్మానించింది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. కొనుగోలుదారులు సొంత వాహనాల్లోనూ ఇసుకను తెచ్చుకోవచ్చని తెలిపింది. అయితే రీచ్‌లలో మాత్రమే తవ్వకాలు జరపాలని, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు జరపరాదని స్పష్టం చేసింది.


  నదులకు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు స్థానిక అవసరాల కోసం ఉచితంగా తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. వినియోగదారుల కోరిక మేరకు కాంట్రాక్టరు 20 వరకు వాహనాలను స్టాక్‌యార్డు వద్ద ఉంచాలని, బలహీన వర్గాల ఇళ్లు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు, రీచ్‌ల సమీపంలో నివసించే వారికి రాయితీపై కూపన్‌ విధానంలో ఇసుక అందజేయాలని కేబినెట్‌ తీర్మానించింది. ఇసుక విధానాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర సంస్థలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులతోనైనా ఇకనుంచి ప్రజలకు సులభంగా ఇసుక దొరుకుతుందేమో చూడాలి.

Updated Date - 2020-11-07T08:31:03+05:30 IST