శనగ విత్తన రాయితీలో కోత!

ABN , First Publish Date - 2020-11-06T09:42:11+05:30 IST

రైతుకు నాణ్యమైన విత్తనాలు తక్కువ ధరకే రాయితీపై అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ధర విషయంలో వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

శనగ విత్తన రాయితీలో కోత!

 50 నుంచి 30 శాతానికి తగ్గింపు

 ప్రభుత్వ ధర క్వింటం రూ.7,500 

 బహిరంగ మార్కెట్‌లో రూ.5 వేలే

సబ్సిడీ నగదు వ్యాపారుల పరం


ఉదయగిరి రూరల్‌, నవంబరు 5 : రైతుకు నాణ్యమైన విత్తనాలు తక్కువ ధరకే రాయితీపై అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ధర విషయంలో వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. శనగ విత్తనాల ధర క్వింటం రూ.7,500 (కిలో రూ.75) నిర్ణయించారు. రాయితీలో కూడా కోత విధించి 50 నుంచి 30 శాతానికి తగ్గించారు. దీంతో క్వింటం రూ.5,250 (కిలో రూ.52.50)లకు అందజేయనుంది. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటం నాణ్యమైన శనగల ధర రూ.5 వేలు పలుకుతోంది. దీంతో పోల్చుకుంటే తక్కువ ధరకు ఇవ్వాల్సిన ప్రభుత్వం రాయితీ సొమ్మంతా వ్యాపారుల పరం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.


 ఎక్కువ ధరపై రైతుల్లో అసంతృప్తి

 శనగ విత్తనాల పూర్తి ధర కిలో రూ.75 కాగా 30 శాతం సబ్సిడీ పోను రూ.52.50లకు అందచేయనున్నారు.  బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. గత రబీలో రైతులు పండించిన శనగలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటం రూ.4,875లకు కొనుగోలు చేసింది. నెలలు కూడా గడవలేదు. అదే ప్రభుత్వం రాయితీపై రైతులకు సరఫరా చేయనున్న విత్తనాల ధరను క్వింటం రూ.7,500లుగా నిర్ణయించారు. గత ఏడాది రూ.6,200 నిర్ణయించి దానిపై 50 శాతం రాయితీతో రైతులకు విత్తనాలు అందించింది. ఈ ఏడాది రూ.7,500 ధర నిర్ణయించి రాయితీని 30 శాతానికి తగ్గించారు. బహిరంగ మార్కెట్లో క్వింటం శనగ ధర రూ.5 వేలలోపే ఉండడంతో రైతులకు పెద్ద ప్రయోజనం ఉండని పరిస్థితి.


 నగదు చెల్లించాకే విత్తనం 

జిల్లాలో రబీ సాగు జోరందుకుంది. కలిగిరి, కొండాపురం, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు, ఆత్మకూరు, పొదలకూరు, ఏఎ్‌సపేట తదితర మండలాల్లో సుమారు 25 నుంచి 30 వేల హెక్టార్లలో రైతులు శనగ పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో 9 వేల క్వింటాళ్ల శనగలను ఏపీ సీడ్స్‌ సంస్థ సిద్ధం చేసింది. గతంలో పంపిణీ కేంద్రాలకు వెళ్లి నగదు చెల్లించి అదేరోజు రాయితీ విత్తనం కొనుగోలు చేసేవారు.


ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జెరాక్స్‌ తీసుకొని కేంద్రానికి వెళితే వీఏఏ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. భూ విస్తీర్ణాన్ని రైతుకు ఎన్ని క్వింటాళ్లు వస్తాయో టోకన్‌ ఇస్తారు. అనంతరం రాయితీ పోను నగదు చెల్లిస్తే ఆన్‌లైన్‌ ద్వారా ఏపీ సీడ్స్‌ సంస్థకు చెల్లించి తరువాత నాలుగైదు రోజులకు విత్తనాలు వస్తాయి. విత్తనాలు బాగున్నా లేకపోయినా రైతులు తీసుకోవాల్సిందే.

Updated Date - 2020-11-06T09:42:11+05:30 IST