ప్లాస్మా’పై నిజనిర్ధారణ కమిటీ

ABN , First Publish Date - 2020-11-03T09:34:16+05:30 IST

ప్లాస్మాను రెడ్‌క్రాస్‌ పక్కదారి పట్టించిందనే ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ వేస్తున్నామని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు.

ప్లాస్మా’పై నిజనిర్ధారణ కమిటీ

 ఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు 

 జిల్లాలో కరోనా కేసుల తగ్గుముఖం

 కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు


తడ, నవంబర్‌ 2 : ప్లాస్మాను రెడ్‌క్రాస్‌ పక్కదారి పట్టించిందనే ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ వేస్తున్నామని కలెక్టర్‌  కేవీఎన్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని తెలిపారు. సోమవారం ఆయన చెన్నై నుంచి నెల్లూరు వెళ్తూ  మార్గమధ్యంలో రామాపురం, తడకండ్రిగ 1 సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ప్రజా సమస్యలపై వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెండు, మూడు వారాలుగా కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఐదు రోజులుగా ఒక్క మరణం కూడా సంభవించలేదన్నారు.


ప్రస్తుతం పాఠశాలలు పునః ప్రారంభించిన దృష్ట్యా విద్యార్థులకు కరోనాపై పూర్తిగా అవగాహన కల్పించాలని తెలిపారు. సచివాలయ వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం  665 సచివాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్లాస్మా విషయంలో కొందరు రెడ్‌క్రాస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్త్తున్నారన్నారు. ఆర్డీవో ఆధ్వర్యంలో వేసే నిజనిర్ధారణ కమిటీలో చెన్నై ఐఐటీ, తిరుపతి సిమ్స్‌ వైద్యశాల ప్రొఫెసర్లను సభ్యులుగా నియమించి విచారణ చేయిస్తామన్నారు. కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను వైసీపీ నాయుకుల కొలవి రఘు, చంద్రారెడ్డి  శాలువాతో సత్కరించారు. కలెక్టర్‌ వెంట జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, పౌరసరఫరాల అధికారి బాలకృష్ణారావు, తహసిల్దారు శాంతకుమారి, ఎంపీడీవో శివయ్య, ఎంఇవో శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T09:34:16+05:30 IST