రైతు భరోసా రెండోవిడత సొమ్ము నేడు జమ

ABN , First Publish Date - 2020-10-27T07:40:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద రెండో విడత సొమ్మును మంగళవారం విడుదల కానుంది.

రైతు భరోసా రెండోవిడత సొమ్ము నేడు జమ

 2,26,060 మంది రైతులకు రూ.46.77 కోట్లు

 అకాల వర్షాలకు నష్టపోయిన 4946 మందికి రూ.499 లక్షలు 


నెల్లూరు (వ్యవసాయం), అక్టోబరు 26 : రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద రెండో విడత సొమ్మును మంగళవారం విడుదల కానుంది. మొదటి విడతగా వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎంకిసాన్‌ రైతు భరోసా, పీఎంకిసాన్‌ పేరుతో ఖరీఫ్‌ పంట వేసే ముందు అంటే మే నెలలో 2,24,571 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.7500 చొప్పున రూ.123.64 కోట్లు ఇచ్చినట్లు  వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆనందకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడతగా రబీ సీజను అవసరాలకు 2,26,060 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.4 వేలు చొప్పున రూ.46.77 కోట్లు వారివారి ఖాతాలో జమ కానున్నట్లు తెలిపారు.


కౌలు రైతులకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ), దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటలు నిమిత్తం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 4946 మంది రైతులకు రూ.499 లక్షలు కూడా మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-10-27T07:40:26+05:30 IST