17 నుంచి చెంగాళమ్మ శరన్నవ రాత్రులు

ABN , First Publish Date - 2020-10-13T12:09:13+05:30 IST

తెలుగు, తమిళ ప్రజల ఆరాధ్య దేవతగా కొలుస్తున్న సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు శరన్నవ రాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

17 నుంచి చెంగాళమ్మ శరన్నవ రాత్రులు

సూళ్లూరుపేట, అక్టోబరు 12 : తెలుగు, తమిళ ప్రజల ఆరాధ్య దేవతగా కొలుస్తున్న సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు శరన్నవ రాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిత్యం చండీయాగం  చేస్తామని  పేర్కొన్నారు. కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అదే రోజు అమ్మణికి పరమేశ్వరి అలంకారం జరుగుతుందని తెలిపారు. 18న బాలత్రిపుర సుందరిగా, 19న గాయత్రి దేవిగా, 20న అన్నపూర్ణగా, 21 సరస్వతిగా, 22న అష్టకాళిగా, 23న మహాలక్ష్మిగా అమ్మణిని అలంకరిస్తారని తెలిపారు.


24న తిథులను అనుసరించి ఉదయం దుర్గాదేవిగా, సాయంత్రం రాజరాజేశ్వరిగా అలంకారాలు జరుపుతామని వెల్లడించారు. 25వ తేది విజయదశమి సందర్బంగా మహిషాసురమర్దని అలంకారం చేసి ప్రాకారోత్సవం జరుపుతామని తెలిపారు. గతంలో విజయదశమి రోజు అమ్మణికి మహిషాసురమర్దని అలంకారం చేసి గ్రామోత్సం నిర్వహించే వారని,  కొవిడ్‌-19 కారణంగా ఈసారి ప్రాకారోత్సవం మాత్రమే  జరుపుతామని తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మణిని భక్తులు దర్శించుకోవచ్చుని చెప్పారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు ఆలయంలో  జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  


జిల్లా మీదుగా మరో 4 రైళ్లు 

నెల్లూరు(వెంకటేశ్వరపురం), అక్టోబరు 12 : జిల్లా ప్రజలకు మరో నాలుగు ప్రత్యేక రైళ్లను  దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సంత్రాగచి - చెన్నై సెంట్రల్‌ 02807 నెంబరు రైలు ఈ నెల 16 తేదీ నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నడుస్తుంది. అలాగే చెన్నై సెంట్రల్‌ - సత్రాగచి 02808 నెంబరు రైలు 18వ తేదీ నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో నడుస్తుంది. వీటికి జిల్లాలో నెల్లూరు, గూడూరులో స్టాపింగ్‌ ఇచ్చారు. ఇదేవిధంగా 14వ తేదీ నుంచి కామాఖ్యా - యశ్వంత్‌పూర్‌ 02552 నెంబరు రైలు ప్రతి బుధవారం వెళుతుంది.


02551 నెంబరుతో యశ్వంతపూర్‌ నుంచి కామాఖ్యాకు 17వ తేదీ నుంచి ప్రతి శనివారం వెళుతుంది. ఈ రెండు రైళ్లకు గూడూరులో మాత్రమే స్టాపింగ్‌ ఇచ్చినట్లు రైల్వే పీఆర్వో రాఖేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏసీ బోగీలతో నడిచే ఈ నాలుగు రైళ్లలో ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్‌ చేయించుకోవాలని తెలిపారు.

Updated Date - 2020-10-13T12:09:13+05:30 IST