ఎక్సరే సెంటర్‌ మూత

ABN , First Publish Date - 2020-10-12T07:39:19+05:30 IST

రేడియాలజిస్టు లేక బుచ్చి ప్రభుత్వాసుపత్రి (సీహెచ్‌సీ)లో ఎక్సరే సెంటర్‌ మూతపడింది. టి.బి, నెమ్ము సంబంధిత రోగులు, కాళ్లు, చేతులు విరిగిన వారికి ఎక్సరే సేవలు అందడం లేదు.

ఎక్సరే సెంటర్‌ మూత

 రేడియాలజిస్టు లేక ఏడు నెలలుగా సేవలు బంద్‌

 సీహెచ్‌సీలో ఎక్సరే ఉన్నా ప్రయోజనం సున్నా

 ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు

 పట్టించుకోని అధికారులు


బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు 11 : రేడియాలజిస్టు లేక బుచ్చి ప్రభుత్వాసుపత్రి (సీహెచ్‌సీ)లో ఎక్సరే సెంటర్‌ మూతపడింది. టి.బి, నెమ్ము సంబంధిత రోగులు, కాళ్లు, చేతులు విరిగిన వారికి ఎక్సరే సేవలు అందడం లేదు. ప్రభుత్వాసుపత్రినే నమ్ముకుని వైద్య సేవలు పొందే పేద, నిరుపేద, మధ్య తరగతి వర్గాల రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కనీసం 2వందలు కూడా ఖర్చుపెట్టుకోలేని నిరుపేదల అవస్థలు వర్ణనాతీతం. 7నెలలుగా సెంటర్‌ మూతపడినా పట్టించుకునే అధికారులు కరువయ్యారని రోగులు వాపోతున్నారు. 


ప్రైవేటు ఆసుపత్రుల ఆశ్రయం

బుచ్చి ప్రభుత్వాసుపత్రిలోని ఎక్సరే సెంటర్‌లో ఎక్స్‌రే ఉన్నా  సేవలు అందడం లేదు.  కోవూరు నియోజకవర్గంతోపాటు సంగం, దగదర్తి మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కరోనా బాధితుల కోసం బుచ్చి మండలం రామచంద్రాపురం గ్రామంలో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. కొవిడ్‌ సెంటర్‌తోపాటు ఎక్సరే సెంటర్‌లో రేడియాలజిస్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. అధికారులు నేటికీ ఆ దిశగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

 ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణకోరగా ఎక్సరే అవసరమైన రోగులను కోవూరు ప్రభుత్వాసుపత్రికి పంపుతామని తెలిపారు. అలాగే రేడియాలజిస్టు కోసం పలు మార్లు ఉన్నతాధికారులతోపాటు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎక్సరే కోసం కోవూరు వెళ్లలేని రోగులు బుచ్చిలోనే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నిరుపేదలు మాత్రం అల్లాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బుచ్చి ఎక్సరే సెంటర్‌కు రేడియాలజిస్టును నియమించి రోగులకు ఎక్సరే సేవలందించాల్సి ఉంది.

Updated Date - 2020-10-12T07:39:19+05:30 IST