మరో ‘సారీ’ !

ABN , First Publish Date - 2020-10-12T07:15:55+05:30 IST

రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లుగా తయారైంది పెన్నా బ్యారేజీ నిర్మాణం పరిస్థితి. పుష్కరకాలం నుంచి సా..గుతున్న పనులను ఈ ఏడాది అక్టోబరులోగా పూర్తిచేస్తామని ప్రభు త్వం ప్రకటించింది.

మరో ‘సారీ’ !

 పెన్నా బ్యారేజీని వీడని గ్రహణం

 పుష్కర కాలంగా సా..గుతున్న పనులు

 పలుమార్లు గడువు విధించినా ఫలితం శూన్యం

 ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం

 ఇప్పటికీ పూర్తిస్థాయిలో మొదలుకాని పనులు

 డిసెంబరులోగానైనా పూర్తి చేస్తారా..?


నెల్లూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లుగా తయారైంది పెన్నా బ్యారేజీ నిర్మాణం పరిస్థితి. పుష్కరకాలం నుంచి సా..గుతున్న పనులను ఈ ఏడాది అక్టోబరులోగా పూర్తిచేస్తామని ప్రభు త్వం ప్రకటించింది. ఈ క్రమంలో మొదట పనులు దక్కించు కున్న కాంట్రాక్టర్‌ నెమ్మదిగా పనులు చేస్తున్నారని, ఆ కాంట్రాక్టర్‌ను పరస్పర ఒప్పందంతో తప్పించారు. దీంతో ఆరు నెలల క్రితం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత మరోసారి కొత్త ఎస్టిమేషన్లతో టెండర్లు పిలిచి మరోసంస్థకు పనులు అప్పగించారు. కానీ ఆరునెలలు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనులు మొదలుకాలేదు. 


కానీ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం మాత్రం పూర్తి కావస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే కొత్త సంస్థ పనులు మొదలుపెడుతోంది. రానున్నది వర్షాకాలం కావడంతో పూర్తిస్థాయిలో పనులు జరగడం కష్టంగా మారుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మరి ప్రభుత్వం అనుకున్న సమయం అక్టోబరులోగా పెన్నా బ్యారేజీ పూర్తవ్వడం అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది డిసెంబరులోగానైనా పెన్నా బ్యారేజీ పూర్తి చేస్తారా.. అన్నది అనుమానంగా ఉంది.


 ఏళ్ల తరబడి పనులు

పెన్నా బ్యారేజీ నిర్మాణం పూర్తయితే లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడంతోపాటు నెల్లూరు - కోవూరు మధ్య రాకపోకలకున్న సమస్యలు తొలగిపోతాయి. మొదట రూ.147 కోట్ల అంచనాతో 2008లో పనులు మొదలయ్యాయి. ఆ తర్వాత పలు కారణాలతో ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. గత ప్రభుత్వంలో పనులు వేగం పుంజుకున్నాయి. రివైజ్డ్‌ ఎస్టిమేషన్లతో ప్రాజెక్టు అంచనా విలువ రూ.192 కోట్లకు చేరుకుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు.


తొలుత ఈ ఏడాది మార్చిలోగా నిర్మాణం పూర్తి చేయాలని ఇరిగేషన్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా, కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో పనుల్లో వేగం కనిపించలేదు. ఇప్పటి వరకూ 86 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 14 శాతం పనులకు సంబంధించి తాజాగా ఎస్టిమేషన్లు వేయగా రూ.113 కోట్లకు చేరింది. మేలో మిగిలిన పనులుకు మళ్లీ టెండర్లు పిలిచారు. ఇద్దరు కాంట్రాక్టర్లు పోటీ పడగా ఓ సంస్థ 1.64 శాతం లెస్‌కు పనులు దక్కించుకుంది. కాగా మిగిలి ఉన్న పనుల్లో ఎక్కువగా ఎర్త్‌ వర్క్‌ పనులున్నాయి. మొత్తం 13.40 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 5.04 లక్షల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే జరిగింది. ఇంకా 8.35 లక్షల క్యూ.మీ ఎర్త్‌ వర్క్‌ జరగాల్సి ఉంది.


అదే విధంగా మరో 8504 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వర్క్‌ కూడా చేయాల్సి ఉంది. ఇంకా పలు గేట్లను పూర్తి స్థాయిలో అమర్చలేదు. పియర్‌ కాలమ్స్‌ కూడా చాలా నిర్మించాల్సి ఉంది. ఇది పూర్తయితే ఒక టీఎంసీ వరకు ఇక్కడ నీరు నిల్వ చేసుకోవచ్చు. అందువల్ల సర్వేపల్లి కాలువ, జాఫర్‌ సాహెబ్‌ కాలువ కిందనున్న సుమారు లక్ష ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ జరుగుతుంది. అలానే నగరానికి తాగునీటి సమస్య కూడా తీరుతుంది.


జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ నియోజకవర్గంలోని ప్రాజెక్టు కావడంతో ఆయన కూడా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతుండడంతో ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఇకపై మంత్రి పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టుపై దృష్టి పెడితే తప్పితే కనీసం డిసెంబరులోగా పూర్తవ్వడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


సమస్యలున్నా పనులు మొదలుపెట్టాం.. హరినారాయణరెడ్డి, టీజీపీ ఎస్‌ఈ

 బ్యారేజీ నిర్మాణ పనులకు టెండర్లు పిలవగా కొత్త సంస్థ పనులు దక్కించుకుంది.. పాత కాంట్రాక్టర్‌ విషయంలో కొన్ని సమస్యలున్నా వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రస్తుతం కొత్త సంస్థతో పనులు మొదలు పెట్టాం. ఇకపై పూర్తిస్థాయిలో పనులు జరుగుతాయి. వీలైనంత త్వరగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. 

Updated Date - 2020-10-12T07:15:55+05:30 IST