కరువుతో డీలా..జామతో భళా!
ABN , First Publish Date - 2020-10-04T06:48:02+05:30 IST
మెట్ట రైతన్నకు తైవాన్‌జామ సిరులు కురిపిస్తోంది. సంప్రదాయ పంటలు సాగు చేస్తున్న కలువాయి ప్రాంత కర్షకులు అప్పులు తప్ప ఏం మిగల్లేదు. ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన వారు కొత్త రకం పంటలసాగుపై దృస్టి సారించారు.
సిరులు కురిపిస్తున్న ‘తైవాన్’ రకం
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
కలువాయి రైతుల విజయదరహాసం
కలువాయి, అక్టోబరు 3 : మెట్ట రైతన్నకు తైవాన్‌జామ సిరులు కురిపిస్తోంది. సంప్రదాయ పంటలు సాగు చేస్తున్న కలువాయి ప్రాంత కర్షకులు అప్పులు తప్ప ఏం మిగల్లేదు. ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన వారు కొత్త రకం పంటలసాగుపై దృస్టి సారించారు. రెండేళ్ల క్రితం కొందరు రైతులు తైవాన్ జామ తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. లాభాలు బాగా వస్తుండటంతో మిగిలిన రైతులు కూడా జామపైనే దృష్టి పెట్టారు. మండలంలోని కలువాయి, దాసరిపల్లె, చవటపల్లి, ఉయ్యాలపల్లి గ్రామాల్లో సుమారు 50 ఏకరాల్లో తైవాన్ జామ తోటలు సాగులో ఉన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకుని ఇక్కడ నాటుతున్నారు. ఇందుకుగాను ఎకరాకు సుమారు రూ.70వేలు ఖర్చు చేశారు. సాగు చేసిన ఏడాది నుంచే కాయలు కాపుకొస్తున్నాయి. అయితే, మొదటి ఏడాది కాపు ఎక్కువ అయితే చెట్టు చిన్నది కావడంతో దెబ్బతినే అవకాశం ఉండటంతో పూత, కాయలు సగానికి సగం కోసేస్తున్నారు. సుమారు 15 ఏళ్లపాటు కాపు నిచ్చే జామ చెట్లు మూడవ ఏడాది నుంచే లాభాలు చేతికి వస్తున్నాయి. రెండేళ్ల తరువాత ఎరువులు, సేద్యం ఖర్చులు మినహా పెద్దగా పెట్టుబడి ఉండదు.
మూడో ఏడాది ఎకరా తోటలో లక్ష రూపాయలకు కూడా కాయలు అమ్మిన రైతులు ఉన్నారు. జిల్లాలోనే కాకుండా తిరుపతి నుంచి కూడా వ్యాపారులు ఒక్కడకొచ్చి జామకాయలు కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి కిలో జామ రూ.20 నుంచి 30 కొనుగోలు చేస్తున్నారు. ఈ రకం జామ సాగు చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరాకు రూ.18వేలు ప్రోత్సాహకం అందజేస్తోందని సాగుదారులు చెబుతున్నారు.
రెండేళ్లకే చేతికి పెట్టుబడులు.. బత్తలపల్లి రవిచంద్ర, కలువాయి
మూడు ఏకరాల్లో తైవాన్ జామ సాగు చేశాను. ఎకరాకు రూ.70వేలు పెట్టుబడి పెట్టాను. రెండేళ్లకు నా పెట్టుబడి చేతికి వచ్చింది. మొదటి ఏడాది చెట్లు చిన్నవిగా ఉండటంతో దిగుబడులు కొద్దిగా వచ్చాయి. పదేళ్లపాటు దిగుబడి ఉంటుంది.
13 ఎకరాల్లో సాగు చేశాను.. పెంచలయ్య, దాసరిపల్లె
13 ఎకరాల్లో జామ సాగు చేశాను. మొదటి ఏడాది ఎకరాకు రూ.25వేలు చేతికి అందింది. రెండో ఏడాది మంచి దిగుబడులు వచ్చాయి. లోకల్ మార్కెట్‌లోనే కాయలు అమ్ముతున్నాము. ఎకరాకు రూ.80 వేల నుంచి 90వేలు దాకా వస్తోంది. ఈ ఏడాది మార్కెటింగ్‌పై కరోనా ప్రభావం చూపుతుంది. మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి లాభాలు గడించవచ్చు.