కొనుగోళ్లు మందగమనం

ABN , First Publish Date - 2020-03-02T11:14:21+05:30 IST

కొనుగోళ్లు మందగమనం

కొనుగోళ్లు మందగమనం

డీఎస్సీ 4770 : వరికోత కోస్తున్న యంత్రం

డీఎస్సీ 4293 : రోడ్డుపై ధాన్యం రాశి
ఫ 45 శాతం వరికోతలు పూర్తి

ఫ ఈనెలలో దాదాపుగా పరిసమాప్తం

ఫ నామమాత్రంగానే కొనుగోళ్లు

ఫ ఇలా అయితే ఎలా అంటున్న రైతులునెల్లూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : రైతులకు మార్చి ఎంతో కీలకం. డెల్టాలో కోతలు ఈ నెలలో పూర్తవుతాయి. ఇప్పటికే 45శాతం వరికోతలు పూర్తయ్యాయి. అనుకున్నస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు సాగలేదు. ఇకపై కూడా ఇప్పటి వరకూ జరిగిన విధంగా కొనుగోళ్లు జరిగితే మొత్తంగా 60-70 వేల మెట్రిక్‌ టన్నులకు మించి కొనుగోలు చేయలేరన్నది రైతుల వాదన. ఇదే జరిగితే రైతుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో తలెత్తుతున్న సమస్యలపై అధికార యంత్రాగం నిరంతరం దృష్టి సారిస్తోంది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ కొనుగోలు కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారు. కానీ ఫలితం కనిపించడం లేదు. కొనుగోళ్లు మాత్రం పూర్తిస్థాయిలో జరగడం లేదు. సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతోందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో సమస్యలు తొలగకపోవడమే కొనుగోళ్లకు ప్రధాన అడ్డంకిగా కనిపిస్తోంది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు మిల్లర్ల సమస్య కూడా లేదు. మొత్తం 193 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటి వరకూ 174 కేంద్రాలను ప్రారంభించారు. వాటన్నింటికీ మిల్లులను ట్యాగ్‌ఆన్‌ చేశారు. గోతాలు కూడా అవసరమైన మేర కేంద్రాలకు చేర్చారు. కానీ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. 


ఫ  రైతుల పరిస్థితేమిటి..?


నీరు పుష్కలంగా ఉండడంతో అధికారికంగా, అనధికారికంగా కలిపి ఏడు లక్షల ఎకరాలకు పైగానే పంట సాగు జరిగి ఉంటుందన్నది వ్యవసాయాధికారుల అంచనా. ఒకేసారి జిల్లా మొత్తం పంట వేయడంతో సాగు ఖర్చు కూడా పెరిగింది. ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చయిన ట్లు రైతులు చెబుతున్నారు. అకాల వర్షాలు, వాతావరణ ప్రభావంతో గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి తగ్గింది. ఇప్పటి వరకూ జరిగిన కోతల్లో ఎకరాకు సరాసరి మూడు పుట్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ మూడు పుట్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర రూ.15,597కు కొంటే రైతుకు సుమారు రూ.45 వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి, వడ్డీలు పోను ఎకరాకు కనీసం రూ.10 వేలయినా మిగులుతుందని రైతులు సంతోషించారు. 


ఫ ఇబ్బందులు తట్టుకోలేక..


 కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేని రైతులు  ధాన్యాన్ని దళారులకు తెగనమ్ముకుంటున్నారు. బీపీటీ, షుగర్‌ లెస్‌ రకం ధాన్యాన్ని దళారులు పుట్టి రూ.14 - 15 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే రైతుకు పెట్టుబడికి సరిపోతోంది. ఇక ఎన్‌ఎల్‌ఆర్‌34449(నెల్లూరు జిలకర) రకం ధాన్యాన్ని మరీ తక్కువగా రూ.12,500 లోపే కొంటున్నారు. ఇది పెట్టుబడికి కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు రైతులను ఆదుకోకపోతే వారి పరిస్థితేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతేడాది 4 లక్షల ఎకరాల సాగుకు 1.72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ దఫా సాగు విస్తీర్ణం రెట్టింపయిన నేపథ్యంలో సుమారు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని జిల్లా ఉన్నతాధికారులు ముందుగా అంచనా వేసుకున్నారు. ఆ ప్రకారమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, గోతాలు సమకూర్చుకోవడం, స్టోరేజీకి గోదాములు సిద్ధం చేసుకోవడం చేశారు. కానీ ఈ అంచనాలు ఇప్పుడు తప్పుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మాదిరిగా కొనుగోళ్లు జరిగితే గతేడాది కొనుగోలు చేసినంత కూడా ఈ ఏడాది కొనుగోలు చేయలేరన్నది వాస్తవం. దీని మూలంగా అంతిమంగా నష్టపోయేది రైతులు మాత్రమే. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2020-03-02T11:14:21+05:30 IST