సుజనారామంకు అంతర్జాతీయ మహిళా అవార్డు
ABN , First Publish Date - 2020-03-02T11:09:01+05:30 IST
సుజనారామంకు అంతర్జాతీయ మహిళా అవార్డు

నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 1 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మొరాకో దేశంలో నిర్వహించే ఉత్సవ పురస్కారానికి నెల్లూరు నగరానికి చెందిన రచయిత్రి పెరుగు సుజనారామం ఎంపికయ్యారు. మొరాకో దేశంలోని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ హ్యూమ్యానిటీ సంస్థ అధినేత ప్రొఫెసర్ అజీజ్ మాంటస్సిర్ వివిధ దేశాల్లోని మహిళా రచయితలను ఎంపిక చేసి ఎక్స్‌లెన్సీ అవార్డులు ప్రదానం చేశారు. సృజనాత్మకత, మానవతావాదం మేళవిస్తూ సుదీర్ఘకాలంగా సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న చిలీ, రుమేనియా తదితర దేశాల రచయితలతోపాటు ఇద్దరు తెలుగు రచయిత్రులకు ఇంటర్నెట్ ఎక్స్‌లెన్సీ అవార్డులు ప్రదానం చేశారు. తెలుగు రచయిత్రులలో నెల్లూరు జిల్లా పొదలకూరు జిల్లా పరిషత్, బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న పెరుగు సుజనారామంకు అవకాశం లభించింది. పెరుగు సుజనారామం ఇప్పటికే సాహిత్య అకాడమీ, షార్క్ దేశాల్లో రచయితల, సాహిత్య సదస్సులో గుర్తింపు పొందారు. గత నవంబరు భువనేశ్వర్‌లో జరిగిన 39వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పొయిట్స్‌లో పాల్గొన్నారు. ఆహ్వాన కవయిత్రిగా, ఇప్పటి వరకు అనేక అంతర్జాతీయ సంకలానాల్లో ఆమె కవితలు అనువాదమయ్యాయి. ఈ సందర్భంగా సహాధ్యాయులు ఆమెను అభినందించారు.