ముగ్గురు మాయగాళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-03-02T11:06:53+05:30 IST

ముగ్గురు మాయగాళ్ల అరెస్టు

ముగ్గురు మాయగాళ్ల అరెస్టు

 పూజ పేరుతో నగదు, నగలతో ఊడాయింపు

బాధితుల ఫిర్యాదుతో ఛేదించిన పోలీసులు


దొరవారిసత్రం, మార్చి 1 : పూజ చేసి చేతబడి పోగొడతామని మోసపూరిత మాటలు చెప్పి నగదు, నగలతో ఊడాయించిన ముగ్గురు నిందితులను ఆదివారం దొరవారిసత్రం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని టపాయిండ్ల  సమీపాన సూళ్లూరుపేట టోల్‌ప్లాజావద్ద నివాసం ఉంటున్న పసుపులేటి శ్రావణి ఇంటికి నెల క్రితం ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. శ్రావణి తల్లికి అనారోగ్యంతో ఉండటంతో చేతబడి చేసి ఉన్నారని, పూజచేస్తే అరిష్టం తొలగిపోతుందని చెప్పారు. ఆ క్రమంలో గతనెల 26వ తేదీన పూజ చేసేందుకు శ్రావణి ఇంటికి కలిగిరి మండలం జిర్రావారిపాళెం గ్రామానికి చెందిన విభూది చిన్నవెంగయ్య, భర్తకవి మస్తాన్‌, టంకుల రామయ్య వెళ్లారు. శ్రావణి, ఆమె భర్త రాజేష్‌కు మాయమాటలు చెప్పి పూజలో కూర్చోబెట్టారు. ఒక బంగారు ఉంగరం, ఒక చైన్‌, రూ. 5వేలు పూజాసామగ్రిలో పెట్టించారు. తర్వాత భార్యాభర్తలు గదిలోకి వెళ్లి కొత్త దుస్తులు ధరించి రావాలని చెప్పారు.  వారు గదిలోకి వెళ్లగానే ఆ మాయగాళ్లు  నగదు, నగలుతో  అక్కడ నుంచి ఊడాయించారు. అనంతరం తాము మోసపోయామని గుర్తించిన శ్రావణి దొరవారిసత్రం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి టోల్‌ప్లాజా వద్ద సీసీ  ఫుటేజీలను పరిశీలించి నిందితుల ఆచూకీని వేగవంతంగా గుర్తించారు. మాయగాళ్లను ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-03-02T11:06:53+05:30 IST