గాంధీ ఆశ్రమం గాడి పడేనా..?
ABN , First Publish Date - 2020-03-02T11:06:13+05:30 IST
గాంధీ ఆశ్రమం గాడి పడేనా..?

శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న పినాకిని ఆశ్రమం
రెడ్‌క్రాస్ నూతన కమిటీ పట్టించుకునేనా?
ఇందుకూరుపేట, మార్చి 1 : స్వాతంత్య్ర సమరానికి ఊతమిచ్చిన ఇందుకూరుపేట మండలం పల్లెపాడు పినాకిని ఆశ్రమం గాంధీజీ ఆశయాలకు ఊపిరి పోస్తుందా..? అనే ప్రశ్న జిల్లా వాసులను కలవరపెడుతున్నది. శతాబ్ది ఉత్సవాలకు చేరువవుతున్న నేపథ్యంలో గాంధీ ఆశయాలకు, సిద్ధాంతాలకు తలమానికంగా నిలవనున్నదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నో ఆటుపోట్లు
99 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఆశ్రమం ఎన్నో ఆటు పోట్లకు గురైంది. ఆక్రమణలకు తలవంచి ఇంకా కుంటి నడక నడుస్తున్నది. ఈ ఆశ్రమం రెడ్‌క్రాస్ నూతన కమిటీ అయినా గాడిలో పెడుతుందా అని పలువురు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంత కాలం ఎన్నో రూ. కోట్లు నిధులు ఖర్చు అయినా ప్రభుత్వ నిధులు విరాళాలు రూ. కోట్లలో ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. ఏకంగా ప్రభుత్వమే రూ. 98 లక్షలు నిధులు మంజూరు చేసినా ఇంత వరకు ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. ప్రారంభం కాని భవనాలు మాత్రం నిలిచి ఉన్నాయి. అక్కడ కూడా వర్గాలు, వర్గపోరు, కుల సమీకరణలు, గాంధీ ఆశ్రమం అనేక వర్గాలుగా చీలిపోయి పని చేస్తోంది. నోరు ఉన్నవారిదే రాజ్యం...అనే విధంగా కొన్ని శక్తులే తమ ఆధీనంలో గాంధీ ఆశ్రమాన్ని ఉంచుకోవడంలో ఎలాంటి అభివృద్ధి సాధించలేదు. కుల సంఘాలు, కుల భోజనాలతో ఇక్కడ కొంతమంది కొన్నివర్గాలను సృష్టిస్తున్నారు. చిట్ట చివరకు ఇటీవల ఈ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ మహిళలకు శిక్షణ, కుట్టు మిషన్ల కేంద్రం, మత్తుపానీయాల నియంత్రణ కేంద్రం లాంటివి ఎన్నో మంజూరైనా అమలు కాలేదు. గాంధీజీ ఫిలాసపి తరగతులను పేరుకు మాత్రం నిర్వహిస్తూ ఆశ్రమం కమిటీ వారు ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు. అందు వలనే ఈ విద్యార్థులు కూడా ఈ తరగతులకు ఎవరు హాజరు కావడం లేదు. నామమాత్రంగా డైట్ కాలేజీ పిల్లలను మాత్రం కూర్చో పెడుతున్నారు. ఆశ్రమంలో చిత్తశుద్ధిగా పని చేస్తున్న నేదురుమల్లి సుబ్బారెడ్డి, గూడూరు లక్ష్మి, మేనేజర్ రామయ్య లాంటి వ్యక్తులను ఆశ్రమానికి దూరంగా నిలబెట్టారు. కొన్ని నెలల్లో శతాబ్ది ఉత్సవాలు చేపడుతున్నా ఇంత వరకు ఎలాంటి కమిటీలను అభివృద్ధి పథకాలను కూడా రచించలేదు. కేవలం ఏడుగురు సభ్యులున్నా ఈ కమిటీలో తన వర్గమంటూ ఒకరిపై ఒకరు పోటీలు పడుతూ 18 మంది సభ్యులను నియమించుకున్నారు. ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్ నిర్వాహకులు మరింత చొరవ తీసుకుని అభివృద్ధి బాటలో పయనింప చేయాలని గాంధేయవాదులు కోరుతున్నారు.