‘నూతన’ వేడుకలన్నీ ఇళ్లలోనే!

ABN , First Publish Date - 2020-12-31T05:21:50+05:30 IST

కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ ప్రారంభమవుతున్నందున నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ఇళ్లలేనే చేసుకోవాలని ఎస్పీ బాస్కర్‌భూషణ్‌ విజ్ఞప్తి చేశారు.

‘నూతన’ వేడుకలన్నీ ఇళ్లలోనే!
డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ

కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ వస్తోంది జాగ్రత్త!

రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు

ఎస్పీ భాస్కర్‌భూషణ్‌


నెల్లూరు (క్రైం)/కావలి, డిసెంబరు 30 :  కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ ప్రారంభమవుతున్నందున నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ఇళ్లలేనే చేసుకోవాలని ఎస్పీ బాస్కర్‌భూషణ్‌ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఒక ప్రకటనలో హెచ్చరించారు. యువకులు గుంపులుగా చేరడం, బైక్‌ హారన్లు మోగిస్తూ రైడింగ్‌లు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందుకు గురిచేస్తే సహించేది లేదన్నారు. రోడ్లపై కేక్‌ కటింగ్‌ చేసి ప్రయాణికులను, వాహనదారులను ఇబ్బంది కలిగించడం వంటి కార్యక్రమాలను నిషేధించామన్నారు. వ్యాపార సంస్థలు, ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసివేయాలని, హోటళ్లు, ఫంక్షన్‌హాల్స్‌, ఇతర సంస్థల్లో జరిగే కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. మద్యం దుకాణాలు, బార్‌లు ప్రభుత్వం వారు ఇచ్చిన సమయ వేళలను పాటించాలన్నారు. అశ్లీల నృత్యాలు నిషేధమని అసాంఘిక, అసభ్యకర కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రార్థన మందిరాల్లో మందిరాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. 


 రికార్డుల పరిశీలన

సాంవత్సరీక తనిఖీలలో భాగంగా ఎస్పీ  బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్‌-19 దృష్ట్యా  ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, మరో మూడు నెలల వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కావలి, గూడూరు, నాయుడుపేట తదితర ప్రాంతాలలో ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కావలిలో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-12-31T05:21:50+05:30 IST