ఎన్నేళ్లకు...! కొత్త కలెక్టరేట్ నిర్మాణంలో కదలిక
ABN , First Publish Date - 2020-10-03T21:07:10+05:30 IST
ఎన్నో ఏళ్ల ప్రయత్నాల తర్వాత జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. ఇప్పటివరకూ నెలకొన్న కోర్టు కేసులన్నీ కొలిక్కి రావడంతో ఉన్నతాధికారులు
తొలగిన కోర్టు కేసులు
పాత టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం
రూ.58 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి నివేదిక
అనుమతులు రాగానే పనుల మొదలు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి) : ఎన్నో ఏళ్ల ప్రయత్నాల తర్వాత జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. ఇప్పటివరకూ నెలకొన్న కోర్టు కేసులన్నీ కొలిక్కి రావడంతో ఉన్నతాధికారులు మళ్లీ దీనిపై దృష్టి సారించారు. దర్గామిట్టలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా పాత టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించనున్నారు. గత ప్రభుత్వం రూ.35 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అప్పుడు టెండర్లు కూడా పలిచారు. అయితే ఇక్కడ కాంట్రాక్టర్ల మధ్య వివాదం, భూ సమస్య కూడా ఏర్పడడంతో పనులు ముందుకు సాగలేదు. ఇవన్నీ కోర్టుకు చేరడం, తర్వాత ఏళ్ల కాలం పట్టింది. కాంట్రాక్టర్ల సమస్యను ముందు కోర్టు పరిష్కరించగా, తర్వాత కొందరు ఆ భూమి తమదంటూ వేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరిపి ఆ స్థలం ప్రభుత్వానికే చెందుతుందని తేల్చింది. దీంతో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి మార్గం సుగుమమైంది. కాగా ఇప్పుడు నిర్మాణ అంచనాలు పెరగడంతో రూ.58 కోట్లు అవసరమంటూ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్థిక శాఖ అనుమతులు లభించిన వెంటనే కలెక్టరేట్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
8 ఏళ్ల ఆలోచన
జిల్లాలో అత్యాధునిక హంగులతో కలెక్టరేట్ నిర్మించాలని సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఆలోచన చేశారు. సుమారు వందేళ్ల క్రితం బ్రిటీషు కాలంలో నిర్మించిన భవనం నుంచే ఇంకా పరిపాలన సాగుతోంది. మారుతున్న పాలనకు అనుగుణంగా అవసరాలు పెరుగుతుండడంతో ప్రస్తుతమున్న కలెక్టరేట్ భవనం ఇరుకుగా మారింది. రికార్డులు కూడా సక్రమంగా పెట్టుకోలేక అధికారులు అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే నీరు కారడం, ఉరవడం, పెచ్చులు ఊడుతుండడంతో ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. పాత టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో కలెక్టరేట్‌ను నిర్మిస్తే పాలనా పరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్, జేసీ బంగ్లాలు పక్కనే ఉన్నాయి. సమీపంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో కీలకమైన జడ్పీ, డీపీవో, డ్వామా, పంచాయతీరాజ్, జిల్లా ఎమర్జెన్సీ సెంటర్ ఉండడం, మరోవైపు కార్పొరేషన్ కార్యాలయం ఉండడం కలిసొచ్చే అంశం. ఇక ప్రస్తుతమున్న కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ నిత్యం ట్రాఫిక్ ఉంటోంది. స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, అధికారుల సమావేశాలకు పార్కింగ్ సమస్య కూడా ఏర్పడుతోంది. వీటన్నింటి నేపథ్యంలో విశాలమైన టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో కలెక్టరేట్‌ను నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి నిధులకు సంబంధించి అనుమతులను ప్రభుత్వం ఎప్పటికి జారీ చేస్తుందో చూడాలి.
అనుమతులు రాగానే పనులు: ఎంవీ.రమణ, డీఆర్వో
కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి కోర్టులో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి. అప్పటికి, ఇప్పటికి అంచనాలు పెరగడంతో రూ.58 కోట్లు అవసరమవుతాయంటూ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు మొదలు పెడతాము.