ఇసుక విక్రయాల్లో బహిరంగ దోపిడీ.. ఒక బిల్లుపై..

ABN , First Publish Date - 2020-09-03T19:19:31+05:30 IST

ఈ ఫొటోలు చూశారా.. నెల్లూరుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇసుక రీచ్‌ వద్ద చిత్రాలు..

ఇసుక విక్రయాల్లో బహిరంగ దోపిడీ.. ఒక బిల్లుపై..

బరి తెగింపు!

రీచ్‌ల్లో డబ్బులు తీసుకుని అమ్మకం

రోజుకు రూ.లక్షల్లో అవినీతి.. 

ప్రభుత్వ ఖజానాకు భారీ గండి 


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): ఈ ఫొటోలు చూశారా.. నెల్లూరుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇసుక రీచ్‌ వద్ద చిత్రాలు ఇవి. అక్కడ కూర్చున్న ఇద్దరు ఇసుక రీచ్‌లో పనిచేసే సిబ్బంది, అక్కడ గుమికూడిన వారు ట్రాక్టర్‌ డ్రైవర్లు, ఓనర్లు. వీరందరి చేతుల్లో రూ.500 నోట్లు ఉన్నాయ్‌ గమనించారా!? ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ కదా. ఇక్కడ డబ్బులు చేతుల్లో పెట్టుకోవాల్సిన పనేముందని అనుకుంటున్నారా..!? అదే మరి విశేషం. ఇసుక సరఫరాలో బరితెగించిన అవినీతికి నిదర్శనం. 


వైసీపీ ప్రభుత్వం కొత్త పాలసీలు ఎన్ని తీసుకొచ్చినా సామాన్యుడికి గుప్పెడు ఇసుక దొరకడం లేదు కానీ... రీచ్‌ల నిర్వాహకులు మాత్రం గోతాల కొద్దీ డబ్బు పోగేసుకొంటున్నారు. ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానానికి మంగళం పలికి నేరుగా డబ్బు తీసుకొని ఇసుక అమ్ముకుంటున్నారు. ఆన్‌లైన్‌తో పని లేకుండా ఐదువందల నోట్లు మూడు (రూ.1500) ఇస్తే చాలు తీసి జేబులో వేసుకొని  ట్రాక్టరుకు ఇసుక ఎక్కిస్తున్నారు. మరీ దుర్మార్గం ఏమిటంటే ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి డబ్బు కట్టి రశీదు పట్టుకొని వెళ్లిన ట్రాక్టర్‌ యజమానులను పక్కకు తోసి విత్‌ అవుట్‌లో తోలగలిగే సత్తా ఉన్న వారికే ఇసుక లోడింగ్‌లో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక లోడు రశీదు మీద వెళితే నాలుగు లోడ్లు విత్‌ అవుట్‌లో పంపుతూ సాయంత్రం అయ్యే సరికి రూ.500 నోట్లు గోతాలకు నింపుకొని వెళుతున్నారు. 


అంతా విత్‌ అవుట్‌..

మామూలుగా ఇసుక కావాలంటే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవాలి. ఒక ట్రాక్టర్‌ ఇసుకకు రూ. 2600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఇందులో రూ.1600 ఇసుకకు, మిగిలిన మొత్తం రవా ణా చార్జీలు. అయితే జిల్లాలో ఇసుక రీచ్‌ల నిర్వాహకులు ప్రభుత్వానికి డబ్బు చెల్లించడం ఎందుకు దండగ అనుకున్నారేమో ట్రాక్టర్‌కు రూ. 1500 నేరుగా తీసుకొని ఇసుక అమ్ముకొంటున్నారు. ఈ అవినీతిలో కూడా ఎంత బరితెగింపు అం టే.. ఒక లోడు రసీదుపై, నాలుగు లోడ్లు విత్‌ అవుట్‌లో తోలగలిగే వారికే ఇసుక ఇస్తున్నారు. కాదన్న వారిని క్యూలైన్లలో పక్కకు నెట్టేస్తున్నారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా వీరికి లోడింగ్‌ జరగడం లేదు. 


సంచుల నిండా డబ్బు

జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది రీచ్‌లు నడుస్తున్నాయి. వీటి లో ప్రధానమైన రీచ్‌లు నెల్లూరు చుట్టుపక్కలే ఉన్నాయి. వీటిన్నింటిలో ఇదే రకం దోపిడీ జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరుకి సమీపంలో ఉన్న రీచ్‌ల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. ఈ రీచ్‌ల్లో రోజుకు సుమారు రూ. 7నుంచి 8 లక్షల మేరకు అవినీతి జరుగుతున్నట్లు సమాచారం. మిగిలిన రీచ్‌ల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజుకు 15 వేల టన్నుల ఇసుకను డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఆధారంగా కేవలం రోజుకు 5వేల టన్నులను మాత్రమే విక్రయిస్తున్నారు. మిగిలిన ఇసుకలో చాలా భాగం ఇలా దొడ్డిదారిన విక్రయించుకొంటున్నట్లు సమాచారం. రీచ్‌లో అక్రమాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నా ఎక్కడ అవి పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇసుక రీచ్‌ల్లో కూడా అధికార పార్టీ నేతల అనుచరుల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. రీచ్‌ల కాంట్రాక్టు పొందిన వారు నామమాత్రం అయ్యారు. వీరి పేరుతో అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరులే రీచ్‌లు నిర్వహిస్తురని, అక్రమ విక్రయాలు సాగిస్తున్నారని సమాచారం. 


సామాన్యులకు ప్రవేశం లేదు..

జిల్లా పరిధిలోని ఏ ఇసుక రీచ్‌లోకి సామాన్యులకు ప్రవేశం లేదు. అలా ప్రవేశించాలని ప్రయత్నించినా రీచ్‌ కాంట్రాక్టర్ల ప్రైవేటు సైన్యం రీచ్‌లకు వెలుపలే అడ్డగిస్తుంది. మీరు ఎవరు, ఎందుకు లోపలికి వెళుతున్నారు, మా సార్‌కు (కాంట్రాక్టరుకు)ఫోన్‌ చేయండి. ఆయన అనుమతిస్తేనే మిమ్మల్ని లోపలికి పంపుతామని అడ్డగిస్తున్నారు. ఈ ప్రైవేటు సైన్యాన్ని దాటుకొని లోనికి వెళ్లడం ఎవరికీ సాధ్యం కాని పని.


అక్రమాలకు కళ్లెం వేసేదెవరు ?

ఇసుక విక్రయాలకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించారు. అక్రమ రవాణాను పట్టుకోవడానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేదు. మీరు విత్‌ అవుట్‌లో తోలండి, మీ ట్రాక్టర్‌ పట్టుకుంటే మాది పూచీ.. అని రీచ్‌లో పనిచేసే సిబ్బంది ట్రాక్టర్‌ యజమానులకు భరోసా ఇస్తున్నారంటే అధికారుల పనితీరు సమర్థవంతంగా ఉం దని ఎలా ఊహించగలం. ఈ క్రమంలో ఇసుక అక్రమాలు కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులందరికీ తెలిసే జరుగుతుందనే ప్రచారం బలంగా సాగుతోంది.Updated Date - 2020-09-03T19:19:31+05:30 IST