కారుణ్య నియామకంలో జరిగిన ఈ వింత గురించి తెలిస్తే..

ABN , First Publish Date - 2020-07-14T18:26:20+05:30 IST

కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వ్యక్తి మరణించిందంటూ..

కారుణ్య నియామకంలో జరిగిన ఈ వింత గురించి తెలిస్తే..

నెల్లూరు: కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వ్యక్తి మరణించిందంటూ మరో వ్యక్తి నగర పాలక సంస్థలో ఉద్యోగం పొందిన విషయం  సోమవారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.... నెల్లూరు నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో పర్మినెంట్‌ కార్మికుడిగా పనిచేస్తున్న పెంచలయ్య 2000వ సంవత్సరంలో మరణించాడు. దీంతో కారుణ్య నియామకం కింద అతని భార్య కృష్ణమ్మకు అధికారులు ఉద్యోగం ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది.


కృష్ణమ్మ కొన్ని రోజులు ఉద్యోగం చేసి ఆపై మానేసింది. ఇది జరిగిన కొన్నేళ్లకు ఆమె కుమార్తెనంటూ రమాదేవి అనే మహిళ వచ్చి, తన తల్లి మరణించిందంటూ కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందింది. ఈ సమయంలో మరణించిన పెంచలయ్యను తానేనంటూ మరొక వ్యక్తి వచ్చి అధికారులకు అఫిడవిట్‌ కూడా అందించడం గమనార్హం. కాగా, మరణించిందని చెబుతున్న కృష్ణమ్మకు ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో సోమవారం కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపగా పెంచలయ్యను నేనేనంటూ వచ్చిన వ్యక్తి, అతని కుమార్తెనంటూ ఉద్యోగం పొందిన రమాదేవి ఇద్దరూ నకిలీలని తేలింది. దీంతో రమాదేవిని విధుల నుంచి పక్కనపెట్టి కేసు నమోదుకు కసరత్తు చేస్తున్నట్లు ఎంహెచ్‌వో వెంకట రమణయ్య తెలిపారు.

Updated Date - 2020-07-14T18:26:20+05:30 IST