వైభవంగా శ్రీవెంగమాంబ పేరంటాలమ్మ
ABN , First Publish Date - 2020-02-16T10:56:38+05:30 IST
వైభవంగా శ్రీవెంగమాంబ పేరంటాలమ్మ
జలధిపూజ మహోత్సవం
సముద్ర స్నానానికి వెంగమాంబ పేరంటాలు
భారీగా తరలివెళ్లిన భక్తులు
ఉదయగిరి రూరల్, ఫిబ్రవరి 15: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీవెంగమాంబ పేరంటాలమ్మ, గురవయ్యనాయుడు జలధిపూజ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్లను ప్రత్యేక వాహనంలో పూలతో అలంకరించి మేళతాళాలు, బాణసంచా పేలుళ్ల నడుమ నర్రవాడ గ్రామ పురవీధుల గుండా సముద్ర స్నానానికి తరలించారు. అమ్మవారి రథోత్సవం నర్రవాడ ఆలయం వద్ద నుంచి బయలుదేరి దుత్తలూరు, వింజమూరు, కలిగిరి, జలదంకి మీదుగా రాత్రికి కావలి శివాలయం వద్దకు చేరుకొంది. దారి పొడవునా అమ్మవారి రథోత్సవానికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. వారుకడవతో నీరు పోసి కాయాకర్పూరం అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అమ్మవారి జలధిపూజ మహోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సముద్రస్నాన కార్యక్రమానికి భక్తులు ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలివెళ్లారు. ఆదివారం ఉదయం కొత్తసత్రం సముద్ర తీరం వద్ద స్వామి, అమ్మవార్ల సముద్ర స్నాన కార్యక్రమం నిర్వహించి తిరిగి ఆలయానికి చేర్చుతారు. అమ్మవారి రథోత్సవం వెంట భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పచ్చవ కరుణాకర్‌బాబు, సభ్యులు పచ్చవ వెంకటేశ్వర్లు, ముసలయ్య తదితరులు పర్యవేక్షించారు.