30రోజుల్లో నష్టపరిహారం అందించాం

ABN , First Publish Date - 2020-12-30T04:46:02+05:30 IST

నివర్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు 30రోజుల్లోనే నష్టపరిహారం అందించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.

30రోజుల్లో నష్టపరిహారం అందించాం
నివర్‌ నష్టపరిహారం చెక్కును రైతులకు అందజేస్తున్న మంత్రి మేకపాటి పక్కనే కలెక్టర్‌

మంత్రి మేకపాటి


నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 29 : నివర్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు  30రోజుల్లోనే నష్టపరిహారం అందించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ పథకం ద్వారా రైతులకు మూడో విడత పెట్టుబడి సాయంతోపాటు నివర్‌ తుఫాన్‌ నష్టపరిహారం పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం ప్రారంభించారు. నెల్లూరులోని  జిల్లా ఎమర్జెన్సీ కేంద్రం నుంచి ఆ కార్యక్రమంలో మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ కారణంగా జిల్లాలో 19,758 హెక్టార్లలో పంట నష్టం జరగ్గా 22,701 మంది రైతులకు రూ.20.95కోట్లు పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకం మూడో విడత కింద 2.43లక్షల మంది రైతులకు రూ.61.78కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 80శాతం సబ్సిడీపై 17,780 క్వింటాళ్ల విత్తనాలు ఇచ్చినట్లు తెలిపారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ కారణంగా చాలా పంటనష్టం వాటిల్లిందని,  యుద్ధప్రాతిపదికన వివరాలు నమోదు చేయించి బాధిత రైతులకు పరిహారం అందేలా కృషి చేసిన వ్యవసాయశాఖ సిబ్బందిని అభినందించారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జేసీ హరేందిరప్రసాద్‌, వ్యవసాయశాఖ ఇన్‌చార్జి జేడీ జీ శివన్నారాయణ, డీడీఏ ప్రసాద్‌, ఏడీఏ అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:46:02+05:30 IST