ఆదాయవనరుగా పుట్టగొడుగుల పెంపకం

ABN , First Publish Date - 2020-02-25T12:27:57+05:30 IST

పుట్టగొడుగులను శాఖాహారులు అమితంగా ఇష్టపడుతున్నారు. మాంసాహారంలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో

ఆదాయవనరుగా పుట్టగొడుగుల పెంపకం

  • కుటీర పరిశ్రమగా చేపడుతున్న మహిళలు
  • పోషక విలువలు కలిగిన ఆహారంగా గిరాకీ

అల్లూరు: పుట్టగొడుగులను శాఖాహారులు అమితంగా ఇష్టపడుతున్నారు. మాంసాహారంలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అంతకంటే అదనంగా ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పుట్టగొడుగుల పెంపకం ప్రస్తుతం లాభదాయకంగా ఉంది. దీన్ని మహిళలు కుటీర పరిశ్రమగా చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. ఈ పుట్టగొడుగులు సాధారణంగా వానాకాలంలో చెత్త, గడ్డిపై పెరుగుతాయి. పల్లెల్లో వీటిని ఎవరూ పట్టించుకోరు. వీటిలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు రహిత ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. 


పుట్టగొడుగులు పెంపకానికి నెల్లూరు జిల్లా వాతావరణం, వనరులూ ఉన్నప్పటికీ అవగాహన లేమితో దీనివైపు పెద్దగా యువత దృష్టి పెట్టడం లేదు. అక్కడక్కడా కొంతమంది ఈ పుట్ట గొడుగులను ఇళ్లలో పెంచి ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. కారణం దీనికి మార్కెట్‌లో గిరాకీ ఉండడమే. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ పుట్టగొడుగుల పెంపకంపై ఇప్పుడిపుడే దృష్టి పెడుతోంది. 


పెరటి మొక్కగా..  


పుట్టగొడుగుల చిన్నచిన్న కుంటుంబాలు పెరటి మొక్కగా పెంచుకని పౌష్టికాహారంగా  తీసుకోవచ్చు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో వీటిని పెంచి మార్కెట్లో విక్రయిస్తే తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. 


పెంచడం ఇలా..


పుట్టగొడుగులను రెండు దశల్లో పెంచుకోవచ్చు. మొదటి దశలో నాణ్యమైన సారవ వరిగడ్డి, రెండో దశలో నల్లమట్టి వినియోగించాలి. ముందుగా నాణ్యమైన వరిగడ్డిని ప్లాస్టిక్‌ కవర్లలో నింపుకునేందుకు వీలుగా చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. పుట్టగొడుగుల విత్తనాలను సిద్ధం చేసుకోవాలి. క్రిమికీటకాలు సోకకుండా వరిగడ్డిని నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం దాన్ని వేడినీటిలో వేసి 120 డిగ్రీల దగ్గర మరిగించాలి. ఆ గడ్డిని క్రిమికీటకాలు లేని చోట 20 నుంచి 30 శాతం తేమ ఉండేలా ఆరబెట్టుకోవాలి.  రెండువైపులా తెరచి ఉండే పాలిథిన్‌ కవర్లను తీసుకొని ఒకవైపు రబ్బరు బ్యాండ్‌తో మూసివేయాలి. రెండో వైపు నుంచి వరిగడ్డి, పుట్టగొడుగు విత్తనాలు నింపుకోవాలి. పాలిథిన్‌ పొరలు పొరలుగా నీటిని నింపుకొని రెండో వైపు కూడా రబ్బరు బ్యాండ్‌తో మూసివేయాలి. తరువాత కవర్లకు అన్ని వైపుల నుంచి గాలి సోకే విధంగా రంధ్రాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న కవర్లను బెడ్స్‌ అని పిలుస్తారు. వీటిని చీకటి గదిలో వెచ్చగా, కార్బన్‌డైయాక్సైడ్‌ తగిలేచోట ఉంచాలి.


కేసింగ్‌ విధానం 


పుట్టగొడుగులు పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయాలంటే 21 రోజులు పడుతుంది. చీకటి గదిలో ఉంచిన బెడ్స్‌ను పరిశీలిస్తే అందులోని శిలీంద్రం అనబడే పుట్టగొడుగుల విత్తనాలు బూజులా కవరంతా వ్యాపిస్తాయి. ఆ దశలో వాటిని తీసుకొని బ్యాగును మధ్యలోకి అడ్డంగా రెండు భాగాలు చేసుకోవాలి. ముందుగా చెప్పుకున్న విధంగా రెండో దశలో కీలకపాత్ర పోషించే నల్లమట్టి 20 కిలోలకు ఐదు కిలోల కొబ్బరిపొట్టు కలిపిన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్నే కేసింగ్‌ అంటారు. రెండు బాగాలుగా విడదీసిన పాలిథిన్‌ బ్యాగు పైభాగాన ఉండే గడ్డిపై ఒక అంగుళం పొరగా ఆ మిశ్రమాన్ని వేసుకొని వెలుతురు సోకే చోట 28 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే గదిలో ట్రేల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఈ ట్రేలను క్రిమికీటకాలు సోకకుండా జాగ్రత్తలు పాటించాలి. రెండో రోజు నుంచి ఈ మట్టిపై నీరు చల్లుకుంటూ ఉండాలి. తద్వారా పుట్టగొడుగుల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 12 నుంచి 13 రోజులకు మొలకలు వస్తాయి. ఇదంతా 21 రోజుల్లో పూర్తి చేసుకొని పుట్టగొడుగుల దిగుబడిని సాధించవచ్చు. 


షెడ్లు యాజమాన్యం 


పుట్టగొడుగుల ఉత్పత్తికి ఉపయోగించే షెడ్లు ఎంత ఎత్తులో ఉంటాయో అంతకు సగభాగం ఎత్తువరకు ఉండే అల్మరాలు అమర్చుకోవాలి. ఈ షెడ్లు పరిశుభ్రమైన వాతావరణంలో గాలి, వెలుతురు పుట్టగొడుగుల ఉత్పత్తికి అనుకూలంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. 


మార్కెట్లో గిరాకీ 


పుట్టగొడుగుల ఈర్గోథియోనైల్‌, సెలీనియం ఆమ్లాలు ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులను పుట్టగొడుగులు దూరం చేస్తాయి. కేన్సర్‌కు కారకాలనుంచి రక్షణ కల్పిస్తాయి. విటమిన్‌-డి లభించేందుకు కొన్ని పుట్టగొడుగులు వినియోగపడతాయి. 90 శాతం నీరు, పొటాషియం కలిగి ఉండడం, కొవ్వు పదార్థాలు అతితక్కువ కలిగిన ఈ పుట్టగొడుగులు రక్తపోటు, అధిక బరువు నుంచి కాపాడతాయి. సగం కప్పు పుట్టగొడుగుల్లో 9 కెలరీలు మాత్రమే కొవ్వు పదార్థం ఉంటుంది.  రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు సమస్య ఉండదు. పొటాషియం తగ్గడం, పక్షవాత ముప్పు నుంచి కాపాడతాయి. ఎముకలు, దంత దృఢత్వానికి ఉపయోగపడతాయి. ఇందులోని కాపర్‌ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి గుండె, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు అవగాహన కల్పిస్తే వారు స్వయం ఉపాధిగా చేసుకునేందుకు వీలుంటుంది.


మంచి ఆదాయ వనరు

షేక్‌ జమాల్‌, నిరుద్యోగి, అల్లూరు  


పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవగాహన కల్పిస్తే స్వయం ఉపాధిగా చేసుకొని ఆదాయం పొందుతారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలి. అప్పుడే కొంత మేరకైనా నిరుద్యోగ సమస్య తీర్చినవారవుతారు.

వినియోగం పెరుగుతోంది 

ప్రసాద్‌ ఆచారి, అల్లూరు. 

పుట్టగొడుగుల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. రెస్టారెంట్లలో సైతం కూరలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. పుట్టగొడుగులతో ఊరగాయ పెడుతున్నారు. మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంది. అవగాహన కల్పిస్తే పెంపకానికి సిద్ధమవుతా.

Updated Date - 2020-02-25T12:27:57+05:30 IST