ఏసీబీ వలలో మున్సిపల్‌ ఉద్యోగి

ABN , First Publish Date - 2020-03-19T09:44:51+05:30 IST

కావలి పురపాలకసంఘంలో సీ-1 గుమస్తా సయ్యద్‌ జంషీర్‌ బాషా రూ. లక్ష లంచం తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం

ఏసీబీ వలలో మున్సిపల్‌ ఉద్యోగి

రూ. లక్ష లంచం తీసుకుంటే దొరికిన సీ-1 గుమస్తా

కావలి మున్సిపాల్టీలో కలవరం


కావలి, మార్చి18: కావలి పురపాలకసంఘంలో సీ-1 గుమస్తా సయ్యద్‌ జంషీర్‌ బాషా రూ. లక్ష లంచం తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్సీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. మున్సిపల్‌ స్టాడింగ్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌ సీహెచ్‌. రమేష్‌కు రావాల్సిన రూ.4.8లక్షల జీతాల బిల్లు కోసం సీ-1 గుమస్తా రూ. 1,25,000 లంచం అడగటంతో రూ. లక్ష ఇస్తూ ఏసీబీకి పట్టించారు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌, బాధితుడు రమేష్‌ చెప్పిన వివరాల మేరకు...


మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌కు అడ్వకేట్‌గా సీహెచ్‌. రమేష్‌ 2017 మే నెలలో నియమితులయ్యారు. ఆయనకు నెలకు రూ.15,000లు జీతం చెల్లించాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 32 నెలలకు జీతం రాకపోవటంతో దానికోసం ఆయన మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ జీతం బిల్లు చూసే సీ-1 గుమస్తా జంషీర్‌ బాషా కొంత కాలంగా తిప్పుకుంటూ ఉన్నాడు. దీంతో అడ్వకేట్‌ 32 నెలలకు జీతం బిల్లును తయారు చేయించి ఈ సంవత్సరం జనవరిలో గుమస్తాకు ఇచ్చారు. 


అయితే మీ పైలు కనిపించలేదు, మీరు అసలు మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌గా అపాయింట్‌ మెంట్‌ అయినట్లుగా ఇక్కడ ఎలాంటి ఫైలు లేదని చెప్పి తనకు రూ.1,25,000 ఇస్త్తే బిల్లు చేసి పెడతానని చెప్పారు. దీంతో అడ్వకేట్‌ దానికి అంగీకరించగా గత నెలలో బిల్లు చేసి రూ.4,80,000 అడ్వకేట్‌ బ్యాంకు ఖాతాలో వేశారు. డబ్బులు బ్యాంకులో పడినప్పటి నుంచి కనీసం రూ.లక్ష అన్నా ఇవ్వమని జంషీర్‌ బాషా డిమాండ్‌ చేస్తుండటంతో ఈ విషయంపై ఫోన్‌లో రికార్డు చేసి మంగళవారం రమేష్‌ నెల్లూరు వెళ్లి ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. దీంతో డీఎస్పీ దేవానంద్‌తో పాటు, సీఐ రమేష్‌బాబు వారి సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం బోజన సమయంలో రూ. లక్ష ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ దేవానంద్‌ తెలిపారు. లంచం పుచ్చుకున్న జంషీర్‌పై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.


లంచం రూపుమాపాలనే పట్టించాను

మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌గా పనిచేస్తున్న తన వద్దనే జీతం బిల్లుకు లంచం అడగటంతో సామాన్య ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెడుతుంటారోనని మరొకరిని లంచం అడగకుండా చేయాలనే తాను ఎసీబీకి పట్టించాను. ఒక న్యాయవాదినే వారు లంచం అడిగారంటే వారు ఎవరిని వదిలిపెట్టరని తెలిసింది. తన జీతం బిల్లుకోసం పైలు కనిపించలేదని ముప్పతిప్పలు పెట్టారు. 

-సీహెచ్‌ రమేష్‌ ,మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌


నెల కిందటే బిల్లు చేశాను 

మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌గా ఆయనకు ఇవ్వాల్సిన జీతాల బిల్లును నెల రోజుల కిందటే అయిపోయింది. గుమస్తా లంచం అడుగుతున్న విషయం ఆయన ఎప్పుడూ తమ దృష్టికి తేలేదు. అలా తెచ్చిఉంటే తానే చర్యలు తీసుకునేవాడిని.

-డాక్టర్‌ కే వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌

Updated Date - 2020-03-19T09:44:51+05:30 IST