అన్నదాతలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-02T04:28:31+05:30 IST
నివర్ తుఫాన్ కారణంగా జిల్లాలో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారని, మానవతా దక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కోరారు.

‘మండలి’లో ఎమ్మెల్సీ వాకాటి
నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట), డిసెంబరు 1 : నివర్ తుఫాన్ కారణంగా జిల్లాలో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారని, మానవతా దక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కోరారు. శాసన మండలి సమావేశాల్లో తుఫాన్ నష్టంపై మంగళవారం జరిగిన చర్చలో ఎమ్మెల్సీ వాకాటి మాట్లాడారు. ఇదివరకే రైతులకు ఇవ్వవలసిన పంట గిట్టుబాటు బకాయిలతోపాటు ఇప్పుడు పంట నష్టం రైతులను కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. కొత్తగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేసి అన్నదాతను ఆదుకోవాలన్నారు. కాళంగి కాలువ, స్వర్ణముఖి, పెన్నా నదులు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పొంగి తీవ్ర నష్టాన్ని, ప్రజలకు అంతులేని ఆవేదనను మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో వాహనదారులు, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ వంతెన నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాపూరు-గూడూరు మధ్యలో దెబ్బతిన్న వంతెన నిర్మాణం కూడా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.